న్యూఢిల్లీ : ప్రధాని మోదీ ఈ రోజు ఉదయం కరోనా వ్యాక్సిన్ తన రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.‘ఈ రోజు ఎయిమ్స్‌లో కోవిడ్ టీకా రెండవ డోసు తీసుకున్నాను, వైరస్‌ను ఓడించడానికి మనకు ఉన్న ముఖ్యమైన మార్గాలలో వ్యాక్సిన్ ఒకటి.
మీరు టీకా తీసుకునేందుకు అర్హులైతే వెంటనే వ్యాక్సిన్ వేయించుకోండి, ఇందుకు కోవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోండి’. అని ఈ సందర్భంగా మోదీ పిలుపునిచ్చారు. కాగా మార్చి 1న ప్రధాని నరేంద్ర మోదీ కరోనా తొలి డోస్ తీసుకున్న విషయం తెలిసిందే.
ఆయన నిబంధనల ప్రకారం మొదటి డోస్ తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఈ వ్యవధిని 6-8 వారాలకు కేంద్రం పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తాజాగా ఈ రోజు రెండవ డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. తొలి డోస్ వేయించుకున్నప్పటిలా కాకుండా ఈసారి ప్రధాని ముఖానికి మాస్క్ ధరించి వ్యాక్సిన్ తీసుకున్నారు.
భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. నిత్యం లక్షలాది మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. వ్యాక్సినేషన్ పరంగా భారత్ ప్రపంచంలోనే ముందు వరుసలోదూసుకుపోతోంది. ముందుగా వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు అందించగా, తర్వాత 60 ఏళ్లు దాటినవారు, 45 ఏళ్లు దాటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నవారికి వ్యాక్సినేషన్ అందజేశారు.