బెంగళూరు: కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు శనివారం రాత్రి విధించిన నైట్ కర్ఫ్యూతో ఆదివారం తెల్లవారుజామున 5 గంటల వరకు రాజధాని నగరం నిశ్శబ్దంగా మారింది. కోవిడ్ కట్టడికి బెంగళూరుతో కలిపి 8 నగరాల్లో ఈ నెల 20 వరకు నైట్ కర్ఫ్యూ జారీ చేసింది కర్ణాటక ప్రభుత్వం.
ఈ శనివారం రాత్రి 10 గంటలకల్లా బెంగళూరులోని దాదాపు అన్ని రోడ్లు, వంతెనలను పోలీసులు మూసివేశారు. ప్రజలెవరూ బయటకు తిరగ కూడదని హొయ్సళ వాహనాల ద్వారా మైకుల్లో ప్రచారం కూడా నిర్వహించారు. 20వ తేదీ వరకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు 144వ సెక్షన్ అమల్లో ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ కమల్‌పంత్ ప్రకటించారు.
మాల్స్, హోటల్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, పబ్స్,క్లబ్స్ తో పాటు వాణిజ్యకేంద్రాలకు రాత్రి 9 గంటలకే బంద్ చేశారు. కళ్యాణ మండపాల్లో రాత్రి 9 గంటలకల్లా కార్యక్రమాలు పూర్తయ్యేలా పోలీసులు నిఘా వేశారు. బార్లు, పబ్‌లను కూడా మూసివేయించడంతో ఎంజీ, బ్రిగేడ్ తదితర ముఖ్యరోడ్లు వెలవెలబోయాయి. నగరంలో సుమారు 180 చోట్లకు పైగా రోడ్లు, బ్రిడ్జిల వద్ద చెక్‌పోస్టులను పెట్టారు. పని లేకున్నా బయటకు వచ్చారని నగర ఆగ్నేయ విభాగంలో 55 బైక్‌లు, ఐదు నాలుగుచక్రాల వాహనాలను సీజ్ చేశారు.