న్యూఢిల్లీ: ఆన్లైన్ లో మనీ ట్రాన్స్‌ఫర్ చేసేవారికి మరియు భారీ మొత్తంలో డబ్బులు లావాదేవీలను నిర్వహించేవారికి ఆర్బీఐ నుండి హెచ్చరిక. దేశవ్యాప్తంగా ఆర్టీజిఎస్ సేవలు ఏప్రిల్ 18వ తేదీ అర్ధరాత్రి 00:00 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు పని చేయవని ఆర్‌బీఐ ప్రకటించింది.
దేశంలో ఆర్‌టీజీఎస్ సేవల విషయంలో పెద్ద అప్‌గ్రేడేషన్ జరగనుంది. ముఖ్యమైన డేటా డిజాస్టర్ రికవరీ టైమ్‌ని పెంచేందుకు టెక్నికల్ అప్‌గ్రేడేషను జరగనుంది. అందుచేత కొద్ది గంటల పాటు ఆర్‌టీజీఎస్ సేవల్ని ఆపివేయాల్సి ఉంటుంది అని ఆర్‌బీఐ తెలిపింది.
కాబట్టి ఆ వేళల్లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి కస్టమర్లు నెఫ్ట్ సేవల్ని వాడుకోవచ్చు. నెఫ్ట్ సేవల విషయంలో ఎలాంటి అంతరాయాలు ఉండవు. పేమెంట్స్ కోసం ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు కూడా వినియోగించుకోవాలనే విషయాన్ని కస్టమర్లకు తెలియజేయాలని బ్యాంకుల్ని కోరింది ఆర్‌బీఐ.
ద్వరైనా 2 లక్షల రూపాయల కన్నా ఎక్కువ మొత్తంలో భారీగా డబ్బుల్ని ట్రాన్స్‌ఫర్ చేయడానికి లావాదేవీలు జరపడానికి ఆర్‌టీజీఎస్ ఉపయోగపడుతుంది. రూ.2,00,000 కన్నా ఎక్కువ ఎంతైనా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. గతేడాది డిసెంబర్ నుంచి ఆర్‌టీజీఎస్ సేవలు 24 గంటల పాటు అందుబాటులోకి వచ్చాయి. అంటే కస్టమర్లు ఎప్పుడైనా ఆర్‌టీజీఎస్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.
గతంలో ఆర్‌టీజీఎస్ వేళలు పరిమితంగా ఉండేవి. భారతదేశంలో ఆర్‌టీజీఎస్ సేవలు 2004 మార్చి 26న ప్రారంభమయ్యాయి. భారతదేశంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు 2019 జూలైలో ఆర్‌టీజీఎస్‌తో పాటు నెఫ్ట్ లావాదేవీలపై ఛార్జీలను ఎత్తేసింది ఆర్‌బీఐ.