శాండల్ వుడ్: సౌత్ లో అసలు సినిమా ఇండస్ట్రీ అంటే తెలుగు, తమిళ్, మలయాళం అన్నట్టు ఉండేది పరిస్థితి. కన్నడ సినిమా ఇండస్ట్రీ గురించి అంతగా పట్టించుకునేవారు కాదు. అక్కడి సినిమాలు కూడా పది సంవత్సరాల వెనకటివా అన్నట్టు ఉండేవి. అడపా దడపా కొన్ని సినిమాలు వచ్చేవి కానీ అంతగా గుర్తింపు లభించేది కాదు. కానీ కే.జి.ఎఫ్ తర్వాత పరిస్థితి మారిపోయింది. అక్కడి నుండి కూడా కొన్ని రిమార్కబుల్ సినిమాలు వస్తున్నాయి. ‘అతడే శ్రీమన్నారాయణ‘ లాంటి సినిమాలు అంతగా ఆడకపోయినా కొంతవరకు ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీ నుండి మరో పాన్ ఇండియా సినిమా విడుదలకి రంగం సిద్ధం చేస్తుంది.
శాండల్ వుడ్ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హీరోగా ‘విక్రాంత్ రోనా’ అనే సినిమా రూపొందుతుంది. మొదట ఫాంటమ్ అనే టైటిల్ తో రూపొందిన ఈ సినిమా విక్రాంత్ రోనా గా విడుదల చేస్తున్నారు. ఫాంటసీ జానర్ లో ఈ సినిమా రూపొందుతుంది. ఇండియా లోనే మొదటి ఫాంటసీ 3D మూవీ అన్నట్టుగా నిర్మాతలు ఈ సినిమాని పరిచయం చేస్తున్నారు. ఈ సినిమా మేకింగ్ గురించి కూడా కొందరు సినీ పెద్దలు ప్రశంసలు కురిపించారు. ఆగష్టు 19 న ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో పలు భాషల్లో విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అనూప్ బండారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని షాలిని జాక్ మంజు, అలంకార్ పాండియన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జూన్ లో రాధే శ్యామ్, జులై లో కే.జి.ఎఫ్ 2 , ఆగష్టు లో పుష్ప మరియు విక్రాంత్ రోనా ఇలా వరుసగా పాన్ ఇండియా సినిమాలు విడుదలకి సిద్ధం అవుతున్నాయి.