హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న కరోనా వ్యాక్సిన్ కొరత వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆదివారం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే కొరత కారణంగా అధికారికంగా బంద్ అని ప్రకటించకుండా ఆదివారం సెలవు కాబట్టి వ్యాక్సిన్ వేయట్లేదని ప్రకటించింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు ఓ ప్రకటన జారీ చేశారు. సోమవారం నుంచి టీకా మళ్ళి యధాతథంగా వేస్తామని ఆయన ప్రకటించారు.
కాగా ఆదివారం కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు 2.7 లక్షల టీకాలు చేరితేనే సోమవారం వ్యాక్సినేషన్ కొనసాగే అవకాశముంది. అదే జరగకుంటే సోమవారం కూడా కొనసాగుతుందా లేదా అన్నది తెలియడంలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా టీకా నిల్వలు తగ్గిపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కానీ ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎక్కడైనా వ్యాక్సిన్ స్టాక్ ఉంటే నిర్దేశిత వయసుల వారు వెళ్ళి వేసుకోవచ్చని, లేదంటే వారు కూడా నిలిపివేస్తారని అంటున్నారు. అయితే ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ టీకాల కార్యక్రమం ఆదివారం నిలిచిపోయే అవకాశం ఉందని అధికార వర్గాలు నుంచి సమాచారం.
వ్యాక్సిన్ల సంఖ్య అనుకున్న మోతాదులో లేనందు వల్ల రాష్ట్రంలో కరోనా మొదటి డోస్ వేయించుకునే వారికి తాత్కాలికంగా బ్రేక్ వేశారు. కాబట్టి ఇక పై కొత్తవారికి టీకా వేయకూడదని వైద్య, ఆరోగ్య శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. కరోనా వ్యాక్సిన్ల కొరత కారణంగా ప్రస్తుతం ఉన్న స్టాక్‌ను సెకండ్ డోస్ వారికి మాత్రమే ఇవ్వాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.