న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు సీజేఐ గా జస్టిస్ నూతలపాటి వెంటక రమణ ఇవాళ తన బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుత సీజేఐ అయిన జస్టిస్ బాబ్డే పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో ఆయన స్థానంలో దేశ 48వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టీస్ రమణ ప్రమాణం చేశారు.
ఈ రోజు భారత రాష్ట్రపతి భవన్లో ఉదయం 11 గంటలకు జస్టిస్ ఎన్వీ రమణతో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి దేశ ఉపరాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్రమంత్రులు, న్యాయమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల, జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
1957 ఆగష్టు 27 వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా పొన్నవరం గ్రామంలో జన్మించిన ఎన్వీ రమణ, 2000 సంవత్సరంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. ఆ తర్వాత ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. 2014 ఫిబ్రవరి 17 వ తేదీన ఎన్వీ రమణ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వచ్చారు.
వచ్చే ఏడాది ఆగస్టు 26 వరకు అంటే 16 నెలల పాటు జస్టిస్ ఎన్వీ రమణ చీఫ్ జస్టిస్‌గా కొనసాగనున్నారు. ప్రస్తుతం దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తున్న వేళ సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు చేపడుతున్నారు. కరోనా నియంత్రణ అంశంపై సుమోటో కేసును సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ విచారణ జరపబోతున్నారు.