అమరావతి : ఏపీలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. లాక్డౌన్ లేకున్నా ప్రజలు బయటకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్న వేళ, ప్రభుత్వం రాష్ట్రం లోని పేద ప్రజలకు 10 కేజీల చొప్పున ఉచిత రేషన్ బియ్యం ఇవ్వడానికి నిర్ణయించింది. మే, జూన్ రెండు నెలలపాటు పేదలకు ఉచిత బియ్యం ఇవ్వనుంది.
కాగా కేంద్రం ఇటీవల ప్రకటించిన 5 కేజీల ఉచిత బియ్యానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 5 కేజీలను ఉచితంగా ఇవ్వనుంది. ఈ నిర్ణయంతో మొత్తం 1.47 కోట్ల కార్డుదారులకు లబ్ధి చేకూరనుంది. కేంద్రం ఇచ్చే రేషన్ బియ్యంతో కేవలం 88 లక్షల మంది వరకు మాత్రమే లబ్ధి అందుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇంకా మిగిలిన 59 లక్షల మందికి ఉచితంగా బియ్యం ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు.
ఇదిలా ఉండగా గడచిన 24 గంటల్లో ఏపీలో 9981 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో రాష్ట్రంలో 51 మరణాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 10,43,441 కు చేరుకున్నాయి, మరియు మృతుల సంఖ్య 7736 కు చేరుకుంది.