న్యూఢిల్లీ: దేశంలో సెకండ్ వేవ్ లో కోవిడ్ భారిగా విజృంభిస్తోంది. రోజుకు దాదాపు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతునే ఉన్నాయి. ఇటీవల మద్రాస్ హై కోర్టు దేశంలో కరోనా విజృంభణకు అసెంబ్లీ ఎన్నికలే ప్రధాన కారణమని వ్యాఖ్యానించింది.
ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు కేంద్ర ఎన్నికల కమిషన్ పై ఘాటైన వ్యాఖ్యలు కూడా చేసింది. కమీషన్ పై హత్య నేరం కేసు పెట్టాలని కూడా సూచించింది. ఇదే తరుణంలో దేశవ్యాప్త విమర్శలు ఎదుర్కొంటున్న వేళలో మే 2న జరగబోయే కౌంటింగ్‌కు సంబంధించి ఈసీ ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికల ప్రక్రియకు హాజరయ్యే సిబ్బంది అందరూ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారు, కోవిడ్ నెగిటివ్ రిపోర్టు ఉన్న వారు అయ్యుండాలి అని వారిని మాత్రమే అనుమతిస్తామని తెలిపింది. ఈ మేరకు బుధవారం ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా ఈ పాటికే విజయోత్సవ ర్యాలీలపై నిషేధం కూడా విధించింది. తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో ఈసీ కౌంటింగ్ కేంద్రాల వద్ద జనసమూహానికి కూడా అనుమతి ఉండదని తెలిపింది.
ఆర్‌టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టు ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రాల వద్దకు అనుమతిస్తారు, అలాగే టీకా రెండు డోసులు తీసుకున్నట్లు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను కౌంటింగ్‌కు 48 గంటల ముందే సంబంధిత అధికారులకు అందజేయాలని తెలిపింది. ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు కూడా కౌంటింగ్ రోజున హాజరయ్యే ఏజెంట్లకు సంబంధించిన లిస్ట్‌ను మూడు రోజుల ముందుగానే అందించాలని తెలిపింది.
ఈ సంవత్సరం మొత్తం నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ గురువారం అనగా 29వ తేదీన బెంగాల్ రాష్ట్రంలో ఆఖరి దశ శాసనసభ ఎన్నికలు జరగుతాయి. ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలు పెద్ద ఎత్తున జనాలతో భారీ ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించాయి. ఈ సభల్లో, ర్యాలిల్లో ఎటువంటి ముందు జాగ్రత్తలు కూడా తీసుకోలేదు అని విమర్శలు కూడా వెల్లువెత్తాయి. అందుకే కోవిడ్ విజృంభిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.