టాలీవుడ్: అల్లుడు శ్రీను సినిమాతో ఇండస్ట్రీ కి అడుగుపెట్టాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ సినిమా పరవాలేదనిపించింది. ఆ తర్వాత పెద్ద డైరెక్టర్ లతో , పెద్ద హీరోయిన్లతో వరుస పెట్టి భారీ బడ్జెట్ సినిమాలు తీసాడు. ఏ సినిమా కూడా ఆశించినంత ఫలితం ఇవ్వలేదు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ‘రాచసన్’ సినిమాని తెలుగులో ‘రాక్షసుడు’ పేరుతో రూపొందించి హిట్ కొట్టాడు. అప్పటి నుండి మంచి సినిమాలే చేస్తా అని, రొటీన్ సినిమాల జోలికి వెళ్లనని కొత్తదనం ఉన్న సినిమాలే చేస్తానని అన్నాడు. మళ్ళీ ‘అల్లుడు అదుర్స్’ అనే పరమ రొటీన్ సినిమా చేసి ఈ సంక్రాంతి కి విడుదల చేసి డిసాస్టర్ మూట కట్టుకున్నాడు.
ఏప్రిల్ 9 న ధనుష్ హీరోగా ‘కర్ణన్’ అనే సినిమా తమిళ్ లో విడుదలైంది. పరియేఱుమ్ పెరుమాళ్ లాంటి సినిమాని రూపొందించిన ‘మారి సెల్వరాజ్‘ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. వివక్ష ని ఎదుర్కొనే ఒక వూరు ని బేస్ చేసుకుని రూపొందించిన ఈ సినిమా పై అమితంగా ప్రశంసల వర్షం కురిసింది. సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా తెలుగు రైట్స్ ని ఈ మధ్యనే బెల్లంకొండ సురేష్ కొన్నారు. ఈ సినిమాని తన కొడుడు బెల్లంకొండ శ్రీనివాస్ ని హీరో గా పెట్టి తీస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం హిందీ లో బెల్లం కొండ శ్రీనివాస్ హీరోగా ‘ఛత్రపతి’ రీమేక్ సినిమా పూర్తి అయిన తర్వాత ఈ సినిమాని తెలుగులో మొదలుపెట్టనున్నట్టు తెలిపారు.