న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ భారీగా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో చాలా మంది ప్రజలు కరోనా ఉందేమో అన్న అనుమానంతో ఎటువంటి లక్షణాలు లేకపోయినా సీటీ స్కాన్ చేయించుకుంటున్నారు. ఈ విషయంపై ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా సీటీ స్కాన్‌కు సంబంధించి కొన్ని కీలకమైన సూచనలు ఇచ్చారు.
ఆయన వ్యాఖ్యల ప్రకారం కరోనా వైరస్ లక్షణాలు ఏవీ కనిపించని వారికి సీటీ స్కాన్ అవసరం లేదు అని తెలిపారు. ఒక్క సీటీ స్కాన్ దాదాపుగ 300-400 ఎక్స్‌రేలతో సమానం అని, దాని వల్ల వారికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని అన్నారు. అవసరం లేకున్నా అనవసరంగా సీటీ స్కాన్ ఎక్కువగా చేయించుకుంటే దాని వల్ల వచ్చే రేడియేషన్‌తో క్యాన్సర్ రావొచ్చని హెచ్చరించారు.
అలాగే కరోనా పాజిటివ్ అని తేలినంత మాత్రాన ఆ రోగులకు సీటీ స్కాన్ అవసరం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. చెస్ట్ ఎక్స్‌రే తీసుకున్న తర్వాత ఇబ్బందిగా ఉంటేనే సీటీ స్కాన్ చేయించుకోవాలి అని తెలిపారు. కరోనా లక్షణాలు లేనివారు ఇంట్లోనే విడిగా ఉండి కూడా కోలుకోవచ్చని ఆయన అన్నారు. వైద్యుల సూచనల మేరకు మాత్రమే రోగులు మందులు వాడాలని గులేరియా తెలిపారు.