టాలీవుడ్: సినిమాల్లో నటించేవాళ్ళు తమకు వచ్చిన ప్రజాదరణ చూసుకుని లేదా ప్రజలకి సేవ చేయాలనే ఉదేశ్యంతో రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇది ఇప్పుడు కాదు ఎప్పటి నుండో జరుగుతుంది. అలా సినిమాల్లోంచి రాజకీయాల్లోకి వెళ్లి ఒక రాష్ట్రానికి ఉత్తమ పదవి అయిన ముఖ్య మంత్రి పదవి ని చేపట్టారు దివంగత నటులు నందమూరి తారకరామారావు, తమిళ నటుడు ఎంజీఆర్, జయలలిత. వీళ్ళే కాకుండా ఎంతో మంది మంత్రులుగా, మెంబర్ అఫ్ పార్లమెంట్ గా, ఎంఎల్ఏ లుగా చాలా సంవత్సరాలు పదవిలో ఉండి ప్రజాసేవలో ఉన్నారు.
కానీ ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నట్టు కనిపిస్తుంది. రాజకీయాల్లో సినిమా వాళ్ళని అస్సలు పట్టించుకోవట్లేదు. టాప్ హీరోలుగా ఇండస్ట్రీ హిట్ లు కొట్టే హీరోలు కూడా రాజకీయాల్లో ఓడిపోయారు. సినిమా వాళ్ళకి సినిమాల్లో ఉండే ఆదరణ ప్రత్యక్ష రాజకీయాల్లో కనపడట్లేదు. మరీ ముఖ్యంగా ప్రజా సేవ కోసం ప్రత్యేక పార్టీ పెట్టి క్షేత్ర స్థాయిలో ప్రయత్నించినా కమల్ హాసన్, పవన్ కళ్యాణ్ లకి మొండి చెయ్యి లభించింది. చెప్పుకోవడానికి ఇన్ని స్థానాల్లో గెలిచాం అని కూడా లేకుండా ఓడిపోయారు. కనీసం వాళ్ళు పోటీ చేసిన స్థానాల్లో కూడా ఓడిపోయారు. అయినా కూడా వెనుకంజ వేయకుండా వీళ్ళు ప్రజలకి అందుబాటులో ఉంటూనే రాజకీయాల్లో కొనసాగుతున్నారు.
ఒక పార్టీ పెట్టి, పార్టీని నిలబెట్టి, కార్యకర్తలని సరైన వాళ్ళని ఎంచుకుని, ఎలక్షన్లలో నిలబెట్టి పార్టీ ని గెలిపించే స్థాయికి వెళ్లాలంటే ఒక సాధారణ పార్టీ కి లేదా సాధారణ వ్యక్తి కి కొన్ని దశాబ్దాలు పడుతుంది. కానీ ఒక సినిమా రంగం నుండి వచ్చిన వాళ్ళకి తక్కువ సమయం పడుతుంది. ఇపుడు ఉన్న జనాలు పరిణామాలు చూసి అంత ఈజీ గా వ్యక్తి ని నమ్మి అధికారం కట్టబెట్టకుండా వీళ్ళని ఓడిస్తున్నారా? లేక సినిమా రంగం నుండి వస్తున్న వాళ్ళ మీద నమ్మకం లేక ఓట్లు వేయడం లేదా అనేది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోతుంది.
ఏది ఏమైనా కానీ ప్రజా సేవలో ఉండాలన్న ఈ హీరోలు పదవి, పవర్ లేకున్నా కూడా ప్రజలకి అందుబాటులో ఉంటూ రాజకీయాల్లో కొనసాగడం ఒక రకంగా మంచి పరిణామమే. ఒక రకంగా వచ్చే తరాలకి ఆదర్శం అని చెప్పుకోవచ్చు.