ముంబై: ఐపీఎల్ 2021 లో పలు ఆటగాళ్ళు కరోనా బారిన పడడంతో టోర్నీని మధ్యలోనే నిరవధికంగా వాయిదా వేశారు. కాగా ఈ విరామం వల్ల పలు విదేశీ ఆటగాళ్ళు దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంత మంది భారత ఆటగాళ్ళు ఉన్నప్పటికీ ఐపీఎల్‌లో విదేశీ జట్టు ఆటగాళ్లు లేకపోతే లీగ్‌కు అంత కళ ఉండదు.
విడేశీ ఆటగాళ్లు లేకుంటే టోర్నీకి అంత మజా రాదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయా ఫ్రాంచైజీలు కోట్లకు కోట్లు వెచ్చించి మరీ వారిని కొనుగోలు చేస్తాయి. ఇదిలా ఉండాగా సీజన్‌లోని మిగిలిన మ్యాచ్‌లను సెప్టెంబర్ విండోలో నిర్వహించే అవకాశం ఉందని బీసీసీఐ చెబుతున్నా అది అంత సులువు కాదని తెలుస్తోంది.
తమ ఆటగాళ్ళ బిజీ షెడ్యూల్ కారణంగా ఇప్పటికే ఐపీఎల్ 14వ సీజన్ రెండో దశకు ఇంగ్లండ్ క్రికెటర్లు అందుబాటులో ఉండరని ఈసీబీ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా ఒకవేళ ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లను సెప్టెంబర్‌లో నిర్వహిస్తే ఇంగ్లండ్ ప్లేయర్లతో పాటు కివీస్ ప్లేయర్లు కూడా లీగ్‌లో ఆడే అవకాశాలు కనపడట్లేదు.
సెప్టెంబర్ నెలలో న్యూజిలాండ్ కు యూఏఈ వేదికగా పాకిస్థాన్‌తో సిరీస్ షెడ్యూల్ చేసి ఉంది. రాబోయే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని కివీస్ ఈ సిరీస్‌ను చాలా సీరియస్‌గా తీసుకునే అలోచనలో ఉంది. అందుచేత కివిస్ కెప్టెన్ విలియమ్సన్, బౌల్ట్ సహా ఇతర ఆటగాళ్లంతా ఐపీఎల్‌కు ఆడకపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
ఒక వేళ అదే జరిగిఐపీఎల్ కు విదేశీ స్టార్లు అందుబాటులో లేకపోతే మాత్రం లీగ్ కళ తప్పడంతో పాటు ఫ్రాంచైజీలు కూడా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మరోవైపు బీసీసీఐ ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఐపీఎల్ 14వ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లను రీషెడ్యూల్ చేసి నిర్వహించాలని భావిస్తోంది.