సిడ్నీ: ఐపీఎల్ 2021 లో సన్రైజర్స్ తరగున ఆడిన వార్నర్ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏమాత్రం తన సహనం కోల్పోకుండా ఎంతో హుందాగా వ్యవహరించాడని సన్‌రైజర్స్ హైదరాబాద్ అసిస్టెంట్ కోచ్ బ్రాడ్ హాడిన్ ప్రశంసించారు.
వార్నర్ పై జట్టులో వేటు పడినా తాను జట్టు ప్రయోజనాల కోసం ఎప్పుడూ ఆలోచించాడని అన్నారు. ఈ ఐపీఎల్-2021 సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ వరుస ఓటముల వల్ల వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించింది యాజమాన్యం. తన స్థానంలో కేన్ విలియమ్సన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించిన యాజమాన్యం, ఈ సీజన్‌లో హైదరాబాద్ చివరగా ఆడిన మ్యాచ్‌లో తుదిజట్టులో అతడికి స్థానం కూడా కల్పించలేదు.
అందుచేత తాను బెంచ్‌కే పరిమితమైన వార్నర్, 12వ ఆటగాడిగా డ్రింక్స్ మోయడానికి వెనకడుగు వేయలేదు. ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులకు ఈ విషయం అస్సలు నచ్చలేదు. జట్టుకు తొలి ఐపీఎల్ కప్ సాధించి పెట్టిన కెప్టెన్‌కు ఇంతటి అవమానమా అని తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
కాగ, ఈ విషయం పై వార్నర్ మాత్రం ఒక్కసారి కూడా ఎటువంటి కామెంట్ చేయలేదు. అంతేకాదు డగౌట్‌లో కూర్చుని జట్టును ఉత్సాహపరుస్తూ తన అవసరం ఉన్నప్పుడల్లా సలహాలు, సూచనలు కూడా ఇచ్చే వాడు. ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ ఆటగాడు బ్రాడ్ హాడిన్ మాట్లాడుతూ, ‘‘వార్నర్‌ను తొలగించడం పట్ల ప్రతి ఒక్కరు షాక్‌కు గురయ్యారు. కానీ తను మాత్రం ఎంతో హుందాగా వ్యవహరించాడు అని అన్నారు.
వార్నర్ తన ప్రమాణాలకు తగ్గట్టుగా ఆడటం లేదని కఠిన చర్యలు చేపట్టింది. ఈ విషయాలను డేవీ అర్థం చేసుకున్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో తను ఒకడు. బెంచ్ మీద కూర్చోవాల్సి వచ్చినా తనేమీ బాధపడలేదు. ప్రతి ఒక్కరికి సలహాలు ఇచ్చాడు. డ్రింక్స్ మోసుకుంటూ పరుగులు తీశాడు. ఇక ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ ఆరింటిలో ఓడిపోయి అభిమానులను నిరాశపరిచింది.