అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రం లో విధించిన కర్ఫ్యూను ఈ నెలాఖరు వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. సరైన ఫలితాలు కావాలంటే రాష్ట్రంలో కనీసం నాలుగు వారాల పాటు కర్ఫ్యూ పాటించాలని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటికి రాష్ట్రంలో కర్ఫ్యూ విధించి సుమారు 10 రోజులే అయిందని సీఎం జగన్ పేర్కొన్నారు. ముఖ్యంగా రూరల్ ప్రాంతంలో కేసులు ఎక్కువ కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కరోనా కట్టడి చర్యలపై సీఎం తన క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. సామావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మరియు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు, ఆశా వర్కర్లు మరియు సచివాలయాల వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలని అన్నారు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. అలాంటి వారిని ఆదుకునేలా ఆర్థిక సహాయంపై తగిన కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
వారి పేరు మీద కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసేలా, దానిపై వచ్చే వడ్డీ ప్రతినెలా వారి ఖర్చులకోసం వచ్చేలాంటి ఆలోచనలు ఏవైనా చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు.