లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మరొక మంత్రి ఇవాళ కరోనా వైరస్‌కు బలయ్యారు. కరోనా వైరస్ పాజిటివ్ గా తేలి ఆస్పత్రిలో పోరాడుతూ చివరకు ఇవాళ కన్నుమూశాడు. విజయ్ కశ్యప్ (56) ముజఫర్‌నగర్ జిల్లా చర్తవాల్ ఎమ్మెల్యేగా ఎన్నికై ఉత్తరప్రదేశ్ రెవెన్యూ, వరద నియంత్రణ శాఖ మంత్రిగా ఆయన పని చేస్తున్నారు. విజయ్ కశ్యప్ మృతితో కోవిడ్ తో మృతి చెందిన మంత్రుల సంఖ్య మూడుకు చేరింది.
ఇటీవల మంత్రి విజయ్ కశ్యప్ కోవిడ్ బారిన పడ్డారు. తీవ్ర అస్వస్థతకు గురవడంతో గుర్గావ్‌లోని వేదాంత ఆస్పత్రిలో అడ్మిత్ చేయించారు. ఆయన ఆరోగ్యం మంగళవారం అర్ధరాత్రి విషమించి మృతి చెందాడు. ఆయన మృతికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వారి ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
అయితే ఉత్తరప్రదేశ్‌లో పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు చనిపోతున్నారు. ప్రధానంగా బీజేపీకి చెందిన నాయకులే కరోనాకు ఎక్కువగా బలవుతున్నారు. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు కరోనాతో మృతి చెందారు. వారిలో కశ్యప్‌తో కలిపి ముగ్గురు మంత్రులు చనిపోయారు.