అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో కోవిడ్ సోకి తల్లిదండ్రులు మృతిచెంది ఎవరూ లేని అనాథలైన చిన్నారులకు ఆర్థిక భరోసా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. దీనికి సంభంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
రాష్ట్రంలో ఇలా అనాథలైన వారిని గుర్తించి తక్షణమే నివేదిక రూపొందించి ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను సీఏం ఆదేశించారు. ఎక్స్‌గ్రేషియాకు అర్హులైనవారి పేరుతో ఏదైనా ఒక జాతీయ బ్యాంకులో రూ.10 లక్షలు జమ చేసి దానికి సంబంధించిన బాండ్‌ను వారికి అప్పగిస్తారని ఆ ఉత్తర్వుల్లో తెలిపారు.
కాగా అటువంటి వారికి 25 ఏళ్ల వయసు నిండిన తరువాత మాత్రమే ఆ డబ్బు తీసుకునేందుకు వీలవుతుందని తెలిపారు. అందాక ఆ డబ్బు డిపాజిట్‌పై వచ్చే వడ్డీని నెలవారీగా కానీ, మూడు నెలలకు ఒకసారి గానీ తీసుకోవచ్చునని తెలిపారు. ఎక్స్‌గ్రేషియాకు అర్హులైన అనాథ చిన్నారులను గుర్తించేందుకు జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఒక కమిటీ వేశారు.
ఎక్స్‌గ్రేషియా పొందడానికి నిర్ధారించిన అర్హతలు:
దరఖాస్తు తేదీ నాటికి పిల్లలకు 18 ఏళ్లలోపు మాత్రమే వయసు ఉండాలి, కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు ఇద్దరూ మరణించిన వారి పిల్లలు లేదా తల్లిదండ్రుల్లో ఒకరు ఇంతకుముందే మరణించి, ఇప్పుడు కోవిడ్ కారణంగా మరొకరు మృతిచెందిన వారి పిల్లలు, కుటుంబ ఆదాయం దారిద్య్రరేఖకు దిగువన ఉండాలి, కోవిడ్ పాజిటివ్ రిపోర్టును విధిగా చూపించాలి, ఇతర బీమా సంస్థల నుంచి లబ్ధి పొందని వారు మాత్రమే దీనికి అర్హులు.