హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు పదవ తరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. హైదరాబాద్‌లో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులతో కలిసి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇవళ మధ్యాహ్నం మూడు గంటలకు వెబ్సైట్లో ఫలితాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
కోవిడ్ కారణంగా ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 5.21 లక్షల మంది పదో తరగతి విద్యార్థులందరినీ ఎటువంటి పరీక్షలు లేకుండానే ఉత్తీర్ణులను చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఫలితాల కోసం bsetelangana.org ను సంప్రదించాలని తెలిపారు.
వారు స్కూల్లలో సాధించిన ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ప్రకారంగా విద్యార్థులకు గ్రేడ్ లను నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. పరీక్షల కోసం నమోదు చేసుకొన్న 5,21,073 మంది విద్యార్థులలో అందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించినట్లు తెలిపారు. వీరిలో 5,16,578 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా 4,495 మంది గతంలో ఫెయిలై ప్రస్తుతం పరీక్ష ఫీజు చెల్లించినవారని వివరించారు.
ఉత్తీర్ణత సాధించిన వారి వివరాలు ఇలా ఉన్నాయి:
- బాలురు 2,62,917
- బాలికలు 2,53,661
- 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులు 2,10,647
- 10/10 జీపీఏ సాధించిన పాఠశాలలు 535
విద్యార్థులు తమ పాస్ మెమోలను వారి సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా పొందవచ్చని సూచించారు. విద్యార్థుల పాస్ మెమోల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే ప్రధానోపాధ్యాయుల ద్వారా ఎస్సెస్సీ బోర్డుకు పంపించాలని సూచించారు. ఉత్తీర్ణులైన విద్యార్థులు భవిష్యత్‌లో మంచి కోర్సులను ఎంపిక చేసుకొని తమ భవిష్యత్‌ను బంగారుమయం చేసుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.