లక్నో: దేశంలో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతూ చాళా మందిని పొట్టన పెట్టుకుంటోంది. కాగా కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా కొందరిని బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ రూపంలో మరో ప్రమాదం భయపెడుతున్న సంగతి విదితమే. కాగా ఈ ఫంగస్ బారిన పడిన వారు ప్రారంభంలోనే గుర్తించకపోతే, దాని వల్ల ఏకంగా ప్రాణాలు కూడా పోతున్నాయి.
ఇప్పటికే బ్లాక్ మరియు వైట్ ఫంగస్‌లు ప్రజలను భయభ్రాంతలకు గురి చేస్తుంటే, కొత్తగా మరో రకం యెల్లో ఫంగస్ రూపంలో ముప్పు ముంచుకొస్తుంది. ఇప్పుడున్న బ్లాక్, వైట్ ఫంగస్‌లకన్నా ఇది చాలా ప్రమాదకరమని అంటున్నారు వైద్య నిపుణులు. ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో తొలిసారిగా ఈ యెల్లో ఫంగస్ కేసును గుర్తించారు వైద్యులు. ప్రస్తుతం బాధితుడికి నగరంలోని ప్రసిద్ధ ఈఎన్టీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
యెల్లో ఫంగస్ లక్షణాలు:
ఈ యెల్లో ఫంగస్ లక్షణాల్లో ముఖ్యంగా బద్ధకం, ఆకలి తక్కువగా ఉండటం, లేదా అసలు ఆకలి లేకపోవడం, బరువు తగ్గిపోవడం యెల్లో ఫంగస్‌లో ప్రధానంగా కనిపించే లక్షణాలు. ఫంగస్ తీవ్రమైతే చీము కారడం, శరీరం మీద ఉన్న గాయాలు, లోపలి గాయాలు నెమ్మదిగా మానడం, పోషకాహార లోపం, అవయవాలు వైఫల్యం చెందడం, చివరికి నెక్రోసిస్ కారణంగా కళ్ళు పోవడం కూడా జరిగే అవకాశం అంటున్నారు వైద్యులు.
యెల్లో ఫంగస్ అనేది ఒక ప్రాణాంతక వ్యాధి, ఎందుకంటే ఇది శరీర అంతర్గతంగా మొదలవుతుంది. అందువల్ల పైన చెప్పిన ఏదైనా లక్షణాలను గమనించిన వెంటనే వైద్య చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం అని సూచిస్తున్నారు వైద్యులు.
ఈ ఫంగస్ వ్యాప్తికి కారణాలు:
ఈ యెల్లో ఫంగస్ ఇన్ఫెక్షన్ ముఖ్యంగా అపరిశుభ్ర వాతావరణం వల్ల వ్యాప్తిస్తుంది. కనుక మన ఇంటిని, మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలను వీలైనంత శుభ్రంగా ఉంచడం చాలా అవసరం. బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుదలను నివారించడానికి మిగిలిపోయిన ఆహారాలు, మల పదార్థాలను వీలైనంత త్వరగా తొలగించుకోవాలి.
మన గృహంలోని తేమ కూడా బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుదలను ప్రోత్సహిస్తుంది కాబట్టి వీలైనంతగా మన ఇంటిని పొడిగా ఉంచుకోవాలి. సరైన తేమ స్థాయి 30% నుంచి 40% వరకు ఉంటుంది. కనుక ఇంటిని సాధ్యమైనంత పొడిగా ఉంచుకోవాలి అని సూచిస్తున్నారు నిపుణులు.