బ్రెజీలియా: బ్రెజిల్ అధికారులు చట్టం ముందు అందరూ సమానమే అనే నానుడిని నిజం చేసి చూపించారు. కోవిడ్ నిబంధనలు పాటించని ఆ దేశ అధ్యక్షుడి మీదే కేసు పెట్టారు అక్కడి అధికారులు. కోవిడ్ విజృంభిస్తునతో బ్రెజిల్ తీవ్రంగా అల్లాడిన సంగతి తెలిసిందే. మునుపు విపరీతంగా కరోనా కేసులు, మరణాలు పెరగడంతో ఆ దేశ అధ్యక్షుడు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నామని ఆయన కంటతడి కూడా పెట్టుకున్నారు.
అప్పుడు తీవ్ర స్థాయిలో విధ్వంసం జరిగనా ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న బ్రెజిల్ అధ్యక్షుడు కోవిడ్ రూల్స్ పాటించకపోవడం అక్కడి అధికారులను తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసింది. నిబంధనలు పాటించనందు వల్ల ఏకంగా అధ్యక్షుడిపైనే కేసు కూడా నమోదు అయ్యింది.
బ్రెజిల్‌లోని మారన్‌హవో రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి కోసం వంద మందికి పైగా పాల్గొనే సమావేశాలపై నిషేధం నడుస్తోంది. ఆంతే కాకుండా మాస్క్ వినియోగించని వారిపైన చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మారన్‌హవో రాజధాని సావో లూయిస్ నగరంలో జరిగిన ఆస్తి పట్టాల పంపిణీ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మాస్క్ కూడా ధరించలేదు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కోవిడ్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వ అధినేతను ‘చబ్బీ డిక్టేటర్’ అంటూ సంబోధించారు.
దీనిపై మారన్‌హవో రాష్ట్ర గవర్నర్ ఫ్లావియో డైనో స్పందించారు. ఆ ప్రాంతంలో ఉన్న కోవిడ్ ఆంక్షలను ఉల్లంఘించినందుకు గాను అధ్యక్షుడు జైర్ బోల్సోనారోపై అధికారులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ఆరోగ్య భద్రతా ప్రమాణాలు పాటించకుండా ప్రోత్సహించేలా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడంతో కేసు నమోదు చేశామని గవర్నర్ స్పష్టంచేశారు. అయితే, అధ్యక్షుడిపై కేసు నమోదు చేసినప్పటికీ దీనిపై అప్పీలుకు వెళ్లేందుకు 15రోజుల సమయం ఉన్నట్లు తెలుస్తోంది.