బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం నుండి భారతదేశ తొలి మహిళా ఫ్లయిట్ టెస్ట్ ఇంజినీర్ దేశానికి లభించింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆశ్రిత వి. ఓలేటిని ఈ ఘనత సాధించిన తొలి మహిళ. 1973 నుంచి ఎయిర్‌ఫోర్స్ నిర్వహిస్తున్న ప్లయిట్ టెస్ట్ ఇంజనీర్ పరీక్షను కేవలం 275 మంది పాసవ్వగా వారిలో తొలి మహిళగా ఆశ్రిత చరిత్ర సృష్టించింది.
ఇక పై భారతీయ ఎయిర్‌ఫోర్స్‌లో ఏదైనా విమానం కొనాలన్నా, ఆ విమానం సేవలు మొదలు పెట్టాలన్నా దానిని పరీక్షించి ఓ.కె చేయాల్సిన బాధ్యత ఆశ్రితకే ఉంటుంది. కర్ణాటక రాష్ట్రం కొల్లెగల్ కు చెందిన ఆశ్రిత బెంగళూరులో ఇంజినీరింగ్ చదివింది. ఆశ్రిత 2014లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ లో చేరి స్క్వాడ్రన్ లీడర్ అయ్యింది. ఇక్కడ తన గొప్ప ఏంటంటే ‘ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ టెస్ట్ పైలెట్ స్కూల్’ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘ఫ్లయిట్ టెస్ట్ కోర్స్’ (43వ బ్యాచ్)లో ఉత్తీర్ణత చెందింది.
కాగా యావత్ ప్రపంచంలో కేవలం 7 మాత్రమే ఉండే ఇలాంటి స్కూల్స్‌లో ఈ కోర్సులో తాను ఉత్తీర్ణత చెందడమే కాకుండా భారతదేశ తొలి మహిళా ఫ్లయిట్ టెస్ట్ ఇంజినీర్ కూడా తానే కావడం అతి పెద్ద విశేషం. ఐ.ఎ.ఎఫ్ ఈ విషయాన్ని తన అఫీషియల్ ట్విటర్ ఖాతాలో ప్రకటించి ఆశ్రితకు అభినందనలు తెలిపింది.
ఇండియన్ ఆర్మీలో ప్రస్తుతం 6,807 మంది మహిళా ఆఫీసర్లు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎయిర్‌ఫోర్స్‌లో 1607 మంది మహిళా ఆఫీసర్లు పని చేస్తున్నారు. నేవీలో మాత్రం వీరి సంఖ్య కేవలం 704 మాత్రమే. పురుషులతో పోలిస్తే త్రివిధ దళాలలో స్త్రీ శాతం తక్కువే అయినా ఇటీవల కాలంలో మారిన పరిస్థితుల్లో జెండర్ అడ్డంకులు అధిగమించి స్త్రీలు ఆ మూడు సైనిక విభాగాలలో తమ స్థానాన్ని నిలబెట్టుకుంటున్నారు. 2015 నుంచి ఎయిర్ ఫోర్స్ తన ఫైటర్ విభాగంలో మహిళల ప్రవేశాన్ని ఆమోదించాక సరిగ్గా ఆరేళ్లకు ఆశ్రిత ఈ అరుదైన ఘనతను సాధించింది.