హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి అనుకోని షాక్ ఇచ్చారు జూనియర్ డాక్టర్లు. అయితే చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లను ప్రభుత్వం తీర్చకపోతే రేపటి నుంచి ఎమర్జెన్సీ, ఐసీయూ సేవలు మినహా మిగితా వైద్య సేవలన్నింటినీ బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. అయినా ప్రభుత్వం నుంచి ఏటువంటి సానుకూల స్పందన రాకుంటే మాత్రం మే 28 నుంచి కొవిడ్ అత్యవసర సేవలను కూడా బహిష్కరిస్తామని తేల్చి చెప్పారు జూనియర్ డాక్టర్లు.
తమకు ఉపకార వేతనాలు పెంచాలని జూనియర్ డాక్టర్లు జనవరి 2020 నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఆలాగే విధినిర్వహణలో మృతి చెందిన జూడాలకు ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించాలన్నారు. జూడాలకు బీమా సౌకర్యంతోపాటు, తమ కుటుంబ సభ్యులకు నిమ్స్‌లో కరోనా వైద్యం ఉచితంగా అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గుమఖం పడుతున్నాయి. ఇంకొద్ది రోజుల్లోనే పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం కనపడుతోంది. ఈ కీలక సమయంలో జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఈ నెల 28 వరకు కొవిడ్ సేవలు కొనసాగిస్తామని జూడాలు హామీ ఇచ్చారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం అంతకు లోపే ఈ సమస్యకు పరిష్కారం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.