న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు మరియు మరణాల సంఖ్య తగ్గుతున్నాయి. ఈ రోజు లక్షన్నరకు దిగువకు రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది. ఇక 24 గంటల్లో 1,27,510 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2,795 మంది కరోనా బారిన పడి మరణం చెందారు.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,55,287 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్ఛార్జయ్యారు. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,81,75,044. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 18,95,520. కరోనాకు చికిత్స పొంది ఇప్పటివరకు డిశ్చార్జయిన వారి మొత్తం సంఖ్య 2,59,47,629.
దేశంలో మొత్తం కరోనా మృతులు 3,31,895. దేశంలో 91.60 శాతం కరోనా రోగుల రికవరీ రేటు ఉండడం గమనార్హం. దేశంలో నమోదైన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 7.22 శాతం. మొత్తం కేసులలో మరణాల రేటు 71.16 శాతంగా ఉంది. ఇక వ్యాక్సిన్ ప్రక్రియలో కొంత వేగం పెరిగింది. 24 గంటల్లో దేశవ్యాప్తంగా 27,80,058 మంది కరోనా వాక్సిన్ తీసుకున్నారు.