అమరావతి: మొదటి నుండి కోవిడ్ టెస్టుల్లో రికార్డు సృష్టించిన ఆంధ్ర ప్రదేశ్, ఇప్పుడు కోవిడ్ సంక్షోభ సమయం మరియు వ్యాక్సిన్ల కొరత తదితర సమస్యలు ఉన్న సమయంలో వాటికి ఎదురీదుతూ రికార్డు సృష్టించింది. ఏపీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో కోటి మందికి ఫస్ట్, సెకండ్ డోసు టీకాలను అందించింది. రాష్ట్ర జనాభాలో దాదాపుగా 20 శాతం మందికి టీకా ప్రకిర్య పూర్తి చేసింది. వ్యాక్సినేషన్‌లో దేశ సగటును ఏపీ అధిగమించింది.
ఏపీలో మొదటి మరియు రెండవ డోస్ టీకాలు వేసుకున్న వారి సంఖ్య ఇవాళకు కోటి దాటేసింది. తాజా సమాచారం మేరకు ఏపీలో మొదటి మరియు రెండో తీసుకున్నవారు 1,00,17,712 మందిగా ఉన్నారు. కేవలం మొదటి డోసు తీసుకున్నవారి సంఖ్య 74,92,944గా నమోదయ్యింది. ఇక స్పెషల్ డ్రైవ్ ద్వారా రెండో డోసు తీసుకున్నవారి సంఖ్య 25,24,768గా ఉంది.
దేశంలో మరియు రాష్ట్రంలో కోవిడ్ సెకండ్ వేవ్ కల్లోలం సృష్టించడంతో ప్రభుత్వ యంత్రాంగాన్ని సీఎం అప్రమత్తం చేశారు. కొవిడ్ వైద్య సేవల్లో ఎక్కడ అంతరాయం రాకుండా చూస్తూ మరోవైపు వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రానికి సకాలంలో కోవీషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లు వచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నారు.