న్యూఢిల్లీ: దేశంలో జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం ఇవాళ ఒక కీలక ప్రకటన చేసింది. కరోనా వ్యాక్లిన్ల మిక్సింగ్ ప్రోటోకాల్‌కి ఎటువంటి అనుమతి లేదని ప్రకటించింది. నీతీ అయోగ్ సభ్యుడు, వ్యాక్సినేషన్ నిపుణుల కమిటీ చైర్మన్ వీకే పాల్ ఈ విషయాన్ని ప్రకటించారు. దేశంలో నెలకొన్న వ్యాక్సిన్ల కొరత సమస్య వచ్చినప్పటి నుంచి టీకా మిక్సింగ్ అంశం తెరపైకి వచ్చింది.
ఇప్పటి వరకు దేశంలో కోవాగ్జిన్, కోవీషీల్డ్ టీకాలు ప్రజలకు వేశారు. దేశంలో ఇప్పటి వరకు చాలా మంది ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని తొలి డోస్ టీకాగా తీసుకున్నారు. ఇప్పటికే కొందరికి రెండు డోసులు పూర్తయ్యాయి. ఇంకొంత మంది రెండో డోసు టీకా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే తొలి డోసు తీసుకున్న టీకా లభ్యత లేకపోవడంతో ఇప్పుడు మరో కంపెనీ టీకాను రెండో డోసుగా తీసుకొవచ్చా? ‘ వ్యాక్సిన్ మిక్సింగ్’? క్షేమమేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఈ విషయంపై వ్యాక్సినేషన్ నిపుణుల కమిటీ చైర్మన్ వీకే పాల్ స్పందించారు. ప్రస్తుతానికైతే టీకా మిక్సింగ్‌ని వ్యాక్సినేషన్ ప్రోటోకాల్‌లో చేర్చలేదని తెలిపారు. వ్యాక్సిన్ మిక్సింగ్ వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నట్టు పరిశోధనల్లో తేలినప్పటికీ అదే స్థాయిలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నట్టు గుర్తించాలన్నారు. వ్యాక్సిన్ మిక్సింగ్‌పై అంతర్జాతీయంగా పరిశోధనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని వీకే సింగ్ వెల్లడించారు.
కాగా మొదటి, రెండో డోసులకు సంబంధించిన గడువు విషయంలో ఎటువంటి మార్పులు లేవని వీకే సింగ్ తెలిపారు. కోవీషీల్డ్ రెండు డోసుల మధ్య గ్యాప్ 12 వారాలు, కోవాగ్జిన్ రెండు డోసుల మధ్య గ్యాప్ 4 వారాలుగానే ఉందని చెప్పారు.