న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ రెండవ వేవ్ లో మరణాల రేటు మొదటి వేవ్ కంటే చాలా ఎక్కువగ ఉంది. మొదటి వేవ్ లో వయసైన వారిని ఎక్కువగా దెబ్బ తీసిన కరోనా, రెండవ వేవ్ లో మాత్రం యువతను లక్ష్యం చేసుకుంది. తద్వారా చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు చాలా మంది మధ్య వయసు వారు మరణించారు.
తల్లిదండ్రులు ఇద్దరూ ఒకే సారి చనిపోవడంతో అనాథలయ్యారు చాలా మంది పిల్లలు. అలా కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో 103 మంది, తెలంగాణలో 123 మంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలయ్యారని సుప్రీంకోర్టుకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తెలిపింది. కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల వివరాలు, తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన వారి వివరాలు తెలపాలంటూ ఇటీవల జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
ఈ మేరకు బాలస్వరాజ్ పోర్టల్‌లో ఆయా రాష్ట్రాలు వివరాలను అప్‌లోడ్ చేయగా ఎన్‌సీపీసీఆర్ అఫిడవిట్ రూపంలో కోర్టుకు మంగళవారం సమర్పించింది. కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా మొత్తం 1,742 మంది చిన్నారులు తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయారని, తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయినవారు 7,464 మంది ఉన్నారని తెలిపింది. ఏపీలో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయినవారు 103 మంది, తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయినవారు 13 మంది ఉన్నారని పేర్కొంది.