చెన్నె: కరోనా వైరస్ మహమ్మారి దేశంలో అక్కడక్కడా ఇంకా విజృంభిస్తూనే ఉంది. తమిళనాట ఈ కరోనా ఉధృతి తగ్గకపోవడంతో లాక్‌డౌన్‌ను పొడిగించింది అక్కడి ప్రభుత్వం. లాక్డౌన్ పొడిగించినా కొన్ని సడలింపులు మాత్రం ఇచ్చారు.
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ లాక్డౌన్ ను జూన్ 14వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 7వ తేదీ వరకు ఉన్న లాక్‌డౌన్‌ను తమిళనాడు ప్రభుత్వం జూన్ 14 వరకు పొడగించింది. ఆంక్షలు, సడలింపులు వంటివి ఉత్తర్వుల్లో వివరంగా పేర్కొంది.
తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ పొడిగించినప్పటికీ 11 జిల్లాలకు మాత్రం మరికొన్ని ఆంక్షలు విధించారు. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మే 24 నుంచి తమిళనాడులో లాక్‌డౌన్ కొనసాగుతోంది.
శుక్రవారం వరకు 21,95,402 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా, 463 మరణాలు సంభవించాయి. దేశంలో కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఉంది. కరోనా కట్టడి కోసం ఎంకే స్టాలిన్ చర్యలు చేపడుతూనే లాక్‌డౌన్‌తో ప్రజలు ఇబ్బంది పడకుండా సహాయక చర్యలు కూడా తీసుకుంటున్నారు.