టాలీవుడ్: కరోనా కారణంగా సెకండ్ వేవ్ లో థియేటర్ లు మూత పడడం తో ఓటీటీ వైపు అడుగులు వేసిన చిన్న సినిమాల్లో ‘అర్ద శతాబ్దం’ ఒకటి. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఒక పీరియాడిక్ లవ్, రివొల్యూషనరీ డ్రామా సినిమా గా రూపొందిన ఈ సినిమా ఈ నెలలో ఓటీటీ లో విడుదలవనుంది. ఈ రోజు ఈ సినిమా నుండి ‘మెరిసెలే’ అంటూ సాగే పాటని విడుదల చేసారు.
ఈ సినిమాలో ఇప్పటికే విడుదలైన ‘ఏ కన్నులూ చూడని చిత్రమే’ అంటూ సాగే పాట చార్ట్ బస్టర్ లో టాప్ లిస్ట్ లో చేరింది. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట మంచి ట్యూన్ తో మైమరిపిస్తోంది. ఈ సినిమాలో మరో పాటతో కూడా అలాంటి ప్రయత్నం చేసింది ఈ సినిమా టీం. శంకర్ మహదేవన్ గాత్రం తో విడుదలైన ‘మెరిసెలే’ అంటూ సాగే పాట వినగానే ఆకట్టుకుంటుంది. ఒక మంచి రొమాంటిక్ సాంగ్ గా ఈ పాట ఆకట్టుకుంటుంది. లిరికల్ వీడియో ప్రకారం హీరో, హీరోయిన్ పెళ్లి చేసుకున్న సందర్భం లో ఈ పాట ఉండనుందని అర్ధం అవుతుంది.
నవ్ ఫల్ రాజా సంగీతం లో రహమాన్ రాసిన ఈ పాటకి శంకర్ మహదేవన్ స్వరం ప్రాణం పోసిందని చెప్పవచ్చు. కేరాఫ్ కంచరపాలెం లో మెప్పించిన నటుడు కార్తీక్ రత్నం ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మరొక ముఖ్య పాత్రలో నవీన్ చంద్ర కనిపిస్తున్నాడు. శుభలేఖ సుధాకర్, సాయి కుమార్, ఆమని, రాజా రవీంద్ర, అజయ్, సుహాస్ మరిన్ని పాత్రల్లో కనిపిస్తున్నారు. రవీంద్ర పుల్లె దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా జూన్ 11 న ఆహ ఓటీటీ లో విడుదలవనుంది.