అమరావతి: నైరుతి రుతుపవనాలు ఏపీని తాకాయి. రాష్ట్రంలో రేపటి నుండి పూర్తిస్థాయిలో రుతుపవనాలు విస్తరించనున్నాయి. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి వర్షాలు విస్తారంగా కురవనున్నాయి. ఇంకోవైపు తూర్పు ఈశాన్య బంగాళాఖాతం, మయన్మార్ పరిసర ప్రాంతంలో సముద్ర మట్టానికి 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఈ నెల 11న అల్పపీడనంగా బలపడనుంది.
ఈ అల్పపీడనం ఒడిశా వైపుకి ప్రయాణిస్తూ బలపడి 24 గంటల్లో వాయుగుండంగా మారబోతుంది. దీని వల్ల రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల్లో ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ సారి రికార్డుస్థాయిలో వర్షపాతం వచ్చే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో 200 నుంచి 250 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అల్పపీడనంతో నైరుతి రుతుపవనాలు వేగం పుంజుకోనున్నాయి. ప్రస్తుతం ఉభయగోదావరి జిల్లాలకు విస్తరించిన రుతుపవనాలు శుక్రవారానికి ఉత్తరాంధ్ర జిల్లాల్లోకి ప్రవేశించనున్నాయి.
నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల కోస్తా ఆంధ్రలో రెండు రోజులు అనేకచోట్ల ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. రాయలసీమ ప్రంటంలో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడనున్నాయి.