టాలీవుడ్: ‘అర్ద శతాబ్దం‘ లాంటి పవర్ఫుల్ టైటిల్ పెట్టి ’50 ఏళ్ళ అతిపెద్ద ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ స్వాతంత్య్రం ఎవరికోసమో దేని కోసమో’ లాంటి పవర్ఫుల్ డైలాగులు ఉన్న టీజర్ ని విడుదల చేసి సినిమా పైన ఆసక్తి కలిగేలా చేసారు మేకర్స్. థియేటర్లు మూతపడడం తో ఈ రోజు ఆహా ఓటీటీ లో ఈ సినిమా విడుదలైంది. మరి ఈ సినిమా టాక్ ఎలా ఉందొ చూద్దాం.
టీజర్ తో అంచనాలకి పెంచిన సినిమా టీం, ట్రైలర్ తో కొంత నిరాశ పరచింది, ఇంక ఈరోజు విడుదలైన సినిమా చూసాక ఆ నిరాశ నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంటుంది. ఒక వూళ్ళో ఉండే కులాల మధ్య ఘర్షణకు సంబందించిన సినిమా, మధ్యలో ఆ ఊరిలోనే జరిగే ఒక మంచి ప్రేమకథ.. ఈ టెంప్లెట్ వినగానే ‘కంచె’ లాంటి ఒక గొప్ప సినిమా గుర్తుకు వస్తుంది కానీ ఈ సినిమా చూసాక అలాంటి సినిమాతో పోల్చడం మనదే తప్పు అనేలా చేసారు. సింపుల్ గా చెప్పాలంటే కథ అదే, కానీ వూళ్ళో జరిగే గొడవలకి కారణం తెలిసాక మరీ దీనికోసమా అనిపిస్తుంది. దానికి తగిన వివరణ కూడా శుభలేఖ సుధాకర్ పాత్ర ద్వారా ఇప్పించినా కూడా అది అంత కన్విన్సింగ్ గా అనిపించదు.
ఒక మంచి కథని ఎంచుకున్నప్పటికీ కథనం విషయం లో డైరెక్టర్ తడబడ్డాడు. తాను రాసుకున్న కథకి మంచి సిచువేషన్స్ ని రాసుకుని సినిమాని ఇంకొంచెం ఇంటెన్స్ గా రాసుకుని ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండేది అనిపిస్తుంది. సరే మెయిన్ స్టోరీ ఇంటెన్సివ్ గా లేదు కనీసం లవ్ స్టోరీ అయినా బాగా తీసాడా అంటే అదీ లేదు. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం అసలు హీరోయిన్ కి కనీసం హీరో ఎవరో తెలియకుండానే మూడు పాటలు హీరో ఊహల్లోనే ఉండడం చిరాకు తెప్పిస్తుంది. ఒక దశలో సినిమా అయిపోయింది అనుకునే సమయం లో సాయి కుమార్ కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూపిస్తారు. ఇలాంటివి సినిమాలో చాలానే ఉంటాయి. పాత్రల తాలూకు స్వభావాల్ని పూర్తిగా ప్రెసెంట్ చేయడం లో డైరెక్టర్ విఫలమయ్యాడు. ఆ పాత్ర అలా ఎందుకు ఉంది , ఎందుకు చేయాల్సి వచ్చింది, అలా ఎందుకు మాట్లాడుతుంది అనే విషయం లో డైరెక్టర్ పూర్తిగా కన్విన్స్ చేయలేకపోయాడు. సాయికుమార్, నవీన్ చంద్ర కారెక్టర్ లలో ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. డైరెక్టర్ గా రవీంద్ర పుల్లే అనుభవ లోపం కనిపిస్తుంది.
డైరెక్టర్ గా విఫలమయినప్పటికీ రైటర్ గా మాత్రం పెన్ పవర్ చూపించాడు. టీజర్ లో వినిపించిన డైలాగ్స్ తో పాటు సినిమాలో ఇంకొన్ని ప్లేసెస్ లో పవర్ ఫుల్ డైలాగ్స్ పెట్టి మెప్పించాడు. ఇంకా క్లయిమాక్స్ లో వచ్చే డైలాగ్ విన్న తర్వాత డైలాగ్ రైటర్ గా మాత్రం రవీంద్ర పుల్లే కి మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పవచ్చు. నవ్ ఫాలా రాజా సంగీతం లో సిద్ శ్రీరామ్ ఆలపించిన ‘ఏ కన్నులూ చూడని చిత్రమే’ పాట గుర్తుండిపోతుంది. సినిమాలో వచ్చే మిగతా తెలంగాణ ఫోక్ సాంగ్స్ బాగానే కుదిరాయి. సినిమాటోగ్రాఫర్ పెద్దగా తమ మార్క్ ఏమీ చూపించుకోలేదు. నిర్మాతలు మేకింగ్ స్టాండర్డ్స్ పరవాలేదనిపించారు.
నటీ నటుల్లో హీరో కార్తీక్ రత్నం తన వంతుగా బాగానే చేసాడు కానీ ముందు చెప్పినట్టు కథనం విసుగ్గా ఉండడం వలన ఈ కారెక్టర్ ని కూడా అంతగా ఎంజాయ్ చెయ్యకపోవచ్చు. మిగతా పాత్రల్లో హీరోయిన్ కృష్ణ ప్రియ, సాయికుమార్, హీరో ఫ్రెండ్స్, రాజా రవీంద్ర, అజయ్, శుభలేఖ సుధాకర్, పవిత్ర, సుహాస్ తమ పాత్రల వరకు మెప్పించారు. కొన్ని పాత్రలకి డైరెక్టర్ వాళ్ళని సెలెక్ట్ చేసుకోకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. అందులో ముందు చెప్పుకోవాల్సింది హీరో తల్లి క్యారెక్టర్. ఆ కారెక్టర్ లో పవిత్ర సూట్ కాలేదు అనిపిస్తుంది.
ఓవరాల్ గా చెప్పాలంటే ‘అర్ద శతాబ్దం’ – అర్ద వంతం లేని ప్రయత్నం.