హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని స్కూళ్లకు ఈ నెల 20 వరకు వేసవి సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఇవాళ ఉత్తర్వులను జారీ చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.
తెలంగాణ ప్రభుత్వం కరోనా సెకండ్ వేవ్ నియంత్రించడం కోసం రాష్ట్రంలో ఇదివరకే విధించిన లాక్‌డౌన్‌ను పొడిగించి, పలు సడలింపులను కూడా ఇచ్చింది. జూన్ నెల 19వ తేదీ వరకు ఈ లాక్‌డౌన్ అమలులో ఉండనుంది. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్ అమలవుతోంది.
రాష్ట్రంలోని తాజా కరోనా వ్యాప్తి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ మీడియట్ రెండవ సంవత్సరం పరీక్షలను కూడా రద్దు చేస్తూ నిర్ణయాన్ని తెలిపింది. అలాగే మొదటి సంవత్సరం విద్యార్థులందరినీ సెకండ్ ఇయర్‌కు ఎటువంటి పరీక్షలు లేకుండా ప్రమోట్ చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ కూడా చేసింది.