మేడ్చల్: మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఇవాళ తెలంగాణలో ఆత్మగౌరవం కోసం సరికొత్త ఉద్యమం మొదలైందని అన్నారు. హుజురాబాద్ లో జరిగి ఎన్నిక తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లాలోని షామీర్‌పేట్‌లోని తన నివాసంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నాల హరిచంద్ర రెడ్డితో కలిసి బుధవారం ఈటల రాజేందర్ సమావేశమయ్యారు.
ఈ సమావేశ్ సందర్భంగా మాట్లాడుతూ, హుజురాబాద్ ఉప ఎన్నికను ప్రజలు తమ సొంత ఎన్నికగా భావిస్తున్నారని తెలిపారు. ప్రతి వ్యక్తి తమకు తామే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఈ ఎన్నిక ఉండనుందన్నారు. ఈ ఉద్యమంలో హుజూరాబాద్ నియోజకవర్గం తనలో స్పూర్తిని నింపిందని అన్నారు. తాను బీజేపీలో చేరినందుకు గర్వంగా ఫీలవుతున్నానని, 2024లో తెలంగాణలో ఎగిరే జండా ఖచ్చితంగా కాషాయం జెండానే అని ఈటల రాజేందర్ అన్నారు.
తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో తాము లేకుంటే కెప్టెన్ ఎక్కడ ఉండేవాడని ఈటల ప్రశ్నించారు. పై నుంచి వచ్చే ఆదేశాలను తమలాంటి వారు సమర్థవంతంగా అమలు చేయకుంటే, తగు పేరు, గుర్తింపు కెప్టెన్ కు వచ్చేవి కావు అని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ పాలనపై ప్రజలు అసహ్యం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కొత్త రాష్ట్రంలో ఇన్ని బాధలు ఉంటాయని తెలంగాణ సమాజం ఊహించి ఉండదని తెలిపారు.
తదుపరి మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నాల హరిచంద్ర రెడ్డి మాట్లాడుతూ, నయా నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తి చేయడమే ఇప్పుడు మనందరి ముందు ఉన్న లక్ష్యమని తెలిపారు. ఈటల రాజేందర్ వెంట మేమంతా ఉంటామని, హుజూరాబాద్‌లో గడప గడపకు వెళ్లి ప్రచారం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.