ముంబై: టెక్నాలజీ రంగంలో ఆటోమేషన్ వేగం పుంజుకోవడంతో దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీలు భారీగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే యోచనలో పడ్డాయి. కాగా 2022 నాటికి ఏకంగా 30 లక్షల మందికి ఉద్వాసన పలకనున్నట్లు సమాచారం.
ఈ ఆటోమేషన్ తో కంపెనీలు జీతాలు మరియు ఇతర ఖర్చులకు సంబంధించి ఏటా 100 బిలియన్ డాలర్ల దాకా మిగిలించుకునే అవకాశం ఏర్పడుతుంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా నుండి విడుదలైన ఒక నివేదికలో ఈ అంశాలు ప్రచురించింది. దేశీయ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ లెక్కల ప్రకారం, ప్రస్తుతం దేశీయంగా ఐటీ రంగంలో 1.6 కోట్ల మంది పైగా ఉద్యోగులు ఉన్నారు.
ఇందులో 90 లక్షల మంది తక్కువ స్థాయి నైపుణ్యాలు ఉన్నవారు, అవసరమైన ఉద్యోగాల్లోనూ, బీపీవో ఉద్యోగాల్లోనూ పనిచేస్తున్నారు. అందుకే ఈ విభాగంలో ఉద్యోగుల తీసివేతకు అవకాశం ఎక్కువ ఉండనుంది. ఈ 90 లక్షల ఉద్యోగాల్లో సుమారు 30 శాతం మంది అంటే దాదాపుగా 30 లక్షల ఉద్యోగాలకు కోత పడనుంది.
అన్నింటికంటే ముఖ్యంగా రోబో ప్రాసెస్ ఆటోమేషన్ (ఆర్పీఏ) ప్రభావమే ఇందుకు ప్రధాన కారణం. ఆర్పీఏ కారణంగా సుమారు 7 లక్షల ఉద్యోగాలకు, ఐటీ కంపెనీలు టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేసుకోవడం తదితర అంశాల మూలంగా మిగతా వాటికి కూడా ఉద్యోగాలలో కోత పడనుంది.
ఈ ఆర్పీఏ అమలు ద్వారా తక్కువ నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాలకు సంబంధించి సుమారు 30 లక్షల కొలువుల్లో కోత పెట్టాలని టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్‌తో పాటు ఇతర సంస్థలు ఈ పాటికే యోచన లో ఉన్నట్లు తెలుస్తోంది. భౌతిక రోబోలు కాకుండా సాఫ్ట్వేర్ అప్లికేషన్ రూపంలో ఉండేదాన్ని ఆర్పీఏగా వ్యవహరిస్తారు. దీన్ని రోజువారీగా భారీ స్థాయిలో చేసే పనుల్లో ఉపయోగిస్తారు.