న్యూఢిల్లీ: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం నుండి శుభవార్త అందింది. వాహనాలకు సంబందించి కీలక పత్రాలైన డ్రైవింగ్ లైసెన్స్(డీఎల్), రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్(ఆర్సీ) విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ పత్రాల చెల్లుబాటు జూన్ 30 వరకు ఉండగా వాహన సంబందిత డాక్యుమెంట్ల గడువును తాజాగా 2021 సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది.
ఈ ప్రభుత్వ నిర్ణయానికి సంబందించి రోడ్డు & రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి ఫిట్నెస్, పర్మిట్(అన్ని రకాల), లైసెన్స్, రిజిస్ట్రేషన్ ఏదైనా ఇతర సంబంధిత డాక్యుమెంట్(ల) గడువును 30 సెప్టెంబర్ 2021 వరకు పొడగించామని కేంద్రం ట్వీట్ ద్వారా తెలిపింది.
క్రిత సంవత్సరం ఫిబ్రవరి 1న ముగిసిన అన్నీ వాహన పత్రాల గడువును ఇప్పుడు సెప్టెంబర్ 30, 2021 వరకు పొడిగించింది. దీని వల్ల సామాజిక దూరాన్ని పాటిస్తూ రవాణా సంబంధిత సేవలను పొందవచ్చని తెలిపింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో పౌరులు, రవాణాదారులు ఇబ్బందులు పడకుండా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సహకరించాలని కేంద్ర మంత్రిత్వ శాఖ కోరింది.