హైదరాబాద్: తెలంగాణలో లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని, పాజిటివ్ రేటు కూడా తక్కువగా ఉన్నండున కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికల ఆధారంగా కేబినెట్ లాక్ డౌన్‌ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది.
లాక్డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించింది. రేపటి నుంచి సినిమా హాళ్లు, పబ్‌లు, షాపింగ్ మాల్స్, వ్యాపార, వాణిజ్య సముదాయాలు తెరచుకోనున్నాయి. యథావిధిగా మెట్రో, బస్సు సర్వీస్‌లు నడవనున్నాయి.
ఇక దీనితో పాటు తెలంగాణలో జులై 1 నుంచి అన్ని రకాల విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం అవనున్నాయి. అయితే ప్రజలు భౌతిక దూరం, మాస్క్‌లు తప్పనిసరి అని, ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం కోరింది. మే 12 నుంచి జూన్ 19 వరకు 38 రోజులపాటు తెలంగాణలో లాక్డౌన్ కొనసాగింది.
దేశవ్యాప్తంగానే కాకుండా, పక్కరాష్ట్రాల్లో కూడా కరోనా నియంత్రణలోకి వస్తున్న విషయాన్ని కేబినెట్ పరిశీలించింది. తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల కంటే వేగంగా కరోనా నియంత్రణలోకి అధికారుందించిన నివేదికల ఆధారంగా కేబినెట్ నిర్థారించింది.
అయితే అన్ని కేటగిరీల విద్యా సంస్థలను, పూర్తి స్థాయి సన్నద్థత తో, జూలై 1 నుంచి ప్రారంభించాలని కేబినెట్ విద్యాశాఖను ఆదేశించింది. ప్రజా జీవనం, సామాన్యుల బతుకు దెరువు దెబ్బతినొద్దనే ముఖ్య ఉద్దేశంతో, రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి ప్రజల సహకారం కావాలని కేబినెట్ కోరింది.