తాడేపల్లి: ఏపీలో ఆదివారం రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. వ్యాక్సిన్ వేసిన సిబ్బందికి సీఎం జగన్ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. తగిన వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటే ఎంతమందికైనా వేసే సమర్ధత ఉందని నిరూపించారని తెలిపారు. పటిష్ట యంత్రాంగం ఉండడం వల్లే ఇంత రికార్డు స్థాయి వ్యాక్సినేషన్ సాధ్యమైందని సీఎం వైఎస్ జగన్ అన్నారు.
అలాగే రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల పనులు యుద్ధ ప్రాతిపదికన జరగాలని, కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సమావేశంలో అధికారులను ఆదేశించారు. బిల్డింగ్, నాన్ బిల్డింగ్ సర్వీసులపై అధికారులు సీఎం జగన్‌కు అధ్యయన వివరాలు తెలియజేశారు. ఆస్పత్రుల ఆవరణ కూడాల్చాళా శుభ్రంగా ఉండాలని, ఆస్పత్రుల నిర్వహణపై ఎస్‌ఓపీలను రూపొందించాలని అధికారులను కోరారు.
రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్ ఆసుపత్రులతో పోటీ పడేలా ఉండాలని, నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గకూడదని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఆస్పత్రుల్లో అత్యవసర విభాగం కూడా సమర్ధవంతంగా ఉండాలని, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ప్రొటోకాల్స్‌పై అధ్యయనం చేయాలన్నారు.
కరోనా వ్యాక్సినేషన్‌లో ఆంధ్రప్రదేశ్ రికార్డును సాధించింది. ఇంతకు ముందు ఒకేరోజు 6.32 లక్షల డోసుల టీకాలు వేసి దేశంలోనే రికార్డు సృష్టించగా నిన్న చేపట్టిన వ్యాక్సిన్ ప్రత్యేక డ్రైవ్ అంచనాలకు అందని రీతిలో విజయవంతమైంది. నిన్న ఒక్కరోజే 13,59,300 మందికి టీకాలు వేశారు. దీంతో ఒకేరోజు ఎక్కువ సంఖ్యలో టీకాలు ఇవ్వడంలో ఏపీ తన రికార్డును తానే అధిగమించింది.