టాలీవుడ్: నాగార్జున నటించిన మన్మధుడు సినిమా లోని ఒక ఫేమస్ పాట నుండి ‘వద్దురా సోదరా’ అనే కాచీ లైన్ తో ఒక సినిమా రాబోతుంది. ఈ రోజు ఆ సినిమా ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ విడుదల చేసారు. ఈ సినిమా ద్వారా కన్నడ హీరో రిషి తెలుగులో పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో రిషి కి జోడీ గా ధన్య బాలకృష్ణన్ నటిస్తుంది.
ఈ సినిమా మోషన్ పోస్టర్ లో ఎలెక్ట్రిక్ కనెక్షన్ ఉన్న ఒక కూర్చి లో కూర్చొని ఉన్న హీరో షాక్ తగులుతున్నా కూడా నవ్వుతూ ఉన్న లుక్ ని విడుదల చేసింది సినిమా టీం. దీని వాయిస్ ఓవర్ గా ‘నా గర్ల్ ఫ్రెండ్ తనకు ఇష్టంలేని వాడిని పెళ్లి చేసుకున్నప్పుడు నేను లేకుండా తను ఎప్పుడూ సంతోషంగా ఉండలేనని చెప్పింది. అప్పటి నుంచి నేను కూడా సంతోషంగా ఉండటం మానేశాను. కానీ ఇప్పుడు ఒక సంతోషపు ముసుగు వేసుకుని బ్రతుకుతున్నాను. పైకి సంతోషంగా లోపల బాధతో మిగిలిపోయాను’ ఇలా ఈ సినిమాలో హీరో కారెక్టర్ ఉండబోతుంది అని ప్రెసెంట్ చేసారు. ఈ డైలాగ్ కొంచెం కామెడీ గానే అనిపించినా ఒక సీరియస్ యాంగిల్ కూడా ఉంది. నిజానికి బయట ఇలాగే ఎంతో మంది బ్రతికేస్తున్నారు. సినిమా కూడా రియాలిటీ కి దగ్గరగా కెనెక్టింగ్ గా ఉంటే మంచి హిట్ అవుతుంది.
ఈ సినిమాని స్వేచ్ఛా క్రియేషన్స్ మరియు స్టాబ్ ఫాబ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ధీరజ్ మొగిలినేని, అమ్రేజ్ సూర్యవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇస్లాహుద్దీన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా గురించి మిగతా వివరాలు తెలియచేయనున్నారు.