హైదరాబాద్ : కరోనా కేసులు తగ్గి లాక్డౌన్ ఎత్తివేయడంతో తెలంగాణలో పలు ప్రవేశ పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్రంలో ఆగస్టు 5 నుంచి 9వ తేదీ వరకు ఎంసెట్, ఆగస్టు 3న ఈసెట్, మరియు ఆగస్టు 11-14 వరకు పీఈ సెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే, తెలంగాణలో జులై 1వ తేదీ నుంచి ప్రత్యక్ష తరగతులు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కరోనా కేసులు తగ్గినందున ఇక నేరుగా క్లాసులు నిర్వహించేందుకే తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. అయితే ఈ ప్రత్యక్ష తరగతులు 8 నుంచి ఆపై తరగతులకు మాత్రమే నిర్వహించే యోచనలో ఉంది. ఇక 7వ తరగతి వరకు యథావిధిగా ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలనుకుంటోంది.
ఇక అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో 2021–22 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ అడ్మిషన్లకు జూలై 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. దేశవ్యాప్తంగా 39 కేంద్రాల్లో ఆగస్టు/సెప్టెంబర్‌లో పరీక్షను నిర్వహించనున్నారు. వర్సిటీలో 17 ఇంటిగ్రేటెడ్, 46 పీజీ, 10 ఎంటెక్, 44 పీహెచ్‌డీ కోర్సుల్లో మొత్తం 2,328 సీట్లు అందుబాటులో ఉన్నాయి.