తాడేపల్లి: గత వారం రోజులుగా ఏపీలో కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ 8 జిల్లల్లో కర్ఫ్యూ వేళలను సడలింపు చేశారు. రాష్ట్రం మొత్తం మీద కాకుండా జిల్లాల పాజిటివిటీ రేటును బట్టి సడలిపులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ లెక్క ప్రకారం 8 జిల్లాలకు కర్ఫ్యూ సడలించారు.
రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువ ఉన్న 8 జిల్లాల్లో జూలై 1వ తేదీ నుండి ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపు ఉంటుంది. ఇక రాత్రి 9 నుంచి 10 మధ్య దుకాణాలు, రెస్టారెంట్లు ఇతరత్రా మూసివేత కొనసాగుతుంది. రాత్రి 9 నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకూ తిరిగి యథావిధిగా కర్ఫ్యూ అమలు జరుగుతుంది. కోవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం చేపట్టిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అనంతపురం, కర్నూలు, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం, వైఎస్ఆర్ కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువ ఉండడం వల్ల సడలింపులు ఇచ్చారు. ఇక మిగిలిన జిల్లాలైన తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో సాయంత్రం 6 గంటల వరకే సడలింపులు కొనసాగుతాయి.
ఈ జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5శాతం కన్నా ఎక్కువగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. జులై 1 నుంచి జులై 7 వరకూ తాజా నిర్ణయాలు వర్తిస్తాయి. పాజిటివిటీ రేటు పరిశీలించాక ఈ జిల్లాల్లో పూర్తి సడలింపుపై మళ్లీ నిర్ణయం తీసుకోనున్నారు.