టాలీవుడ్: ఇవివి సత్యనారాయణ కుమారుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి కామెడీ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన నటుడు అల్లరి నరేష్. వరుస సినిమాలు చేస్తూ మినిమం గారంటీ హీరోగా పేరు గాంచి 50 కి పైగా సినిమాల్లో హీరోగా మెప్పు పొందాడు. తర్వాత సినిమాలన్ని మూస ధోరణి లో ఉండే సరికి సినీ అభిమానులు అల్లరి నరేష్ సినిమాలని అంతగా ఆదరించలేదు. కొంచెం గ్యాప్ తీసుకుని మహేష్ బాబు ‘మహర్షి’ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో నటించి మరో సారి కం బ్యాక్ అయ్యాడు. ఈ సంవత్సరం విడుదలైన ‘నాంది‘ సినిమా తో ఒక సీరియస్ సబ్జెక్టు తీసుకుని హిట్ కొట్టి అప్పటి నుండి రొటీన్ సినిమాలు కాకుండా ప్రత్యేకమైన సినిమాలే చేస్తానని చెప్పాడు.
ఈ రోజు అల్లరి నరేష్ పుట్టిన రోజు సందర్భంగా ఒక కొత్త సినిమా ప్రకటించి ఒక పోస్టర్ విడుదల చేసారు. ఈ సినిమాని ‘సభకు నమస్కారం’ అనే టైటిల్ తో రూపొందించనున్నట్టు ప్రకటించారు. అంతే కాకుండా ఈ పోస్టర్ లో అల్లరి నరేష్ ఒక సభలో రాజకీయ నాయకుడిగా లాగా అభివాదం చేస్తున్నట్టు వెనక నుండి చూపించారు. దానితో పాటు నరేష్ పాంట్ వెనక జేబుల్లో ఒక దాన్లో డబ్బు మరొక దాన్లో మందు బాటిల్ చూపించి ప్రస్తుత రాజకీయ పరిస్థితులకి అద్దం పట్టేలా ఈ సినిమా ఉండబోతున్నట్టు హింట్ ఇచ్చారు. మరి ఈ సినిమా సీరియస్ కంటెంట్ తో వెళ్తుందా లేక రాజకీయాలపై సెటైరికల్ కామెడీ నా అనేది మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు.
నరేష్ 58 వ సినిమాగా రూపొందనున్న ఈ సినిమాని ‘మిస్ ఇండియా’, ‘కల్యాణ వైభోగమే’, ‘118’ లాంటి సినిమాలని రూపొందించిన ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు. ప్రముఖ డైలాగ్ రైటర్ అబ్బూరి రవి ఈ సినిమాకు పని చేయనున్నారు. పూరి జగన్నాద్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన సతీష్ మల్లంపాటి అనే నూతన దర్శకుడు ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నాడు.