న్యూఢిల్లీ: దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ నుంచి బ్యాంక్ చార్జీల వరకు జూలై 1, 2021 నుంచి అనేక కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం, పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. అన్నీ కలిపి ఒక చోట టూకీగా మీ కోసం:
ఎస్‌బీఐ:
జూలై 1 నుంచి ఎస్‌బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారుల జేబుకు చిల్లులు పడనున్నాయి. ఒక నెలలో బ్యాంకు శాఖలు, ఏటీఎంల నుంచి అన్ని కలిపి ఉచితంగా కేవలం నాలుగుసార్లు మాత్రమే నగదు తీసుకోవడానికి వీలుంటుంది. ఆపై ప్రతి లావాదేవీపై రూ.15 (జీఎస్టీ అదనం) చొప్పున అదనపు రుసుమును చెల్లించాల్సి వస్తుంది. అలాగే, ఒక ఆర్ధిక సంవత్సరంలో 10 చెక్స్ మాత్రమే ఉచితంగా అందించనున్నారు.
ఎల్‌పీజీ గ్యాస్:
ఎల్‌పీజీ లేదా వంట గ్యాస్ రేట్లు కూడా జూలై 1వ తేదీ నుండి మార్చనున్నారు. ఇకపై ప్రతి 5 రోజులకు ఒకసారి అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా చమురు కంపెనీలు తమ ఎల్‌పీజీ ధరలను సవరిస్తాయి.
డ్రైవింగ్ లైసెన్స్:
జూలై 1 నుంచి కేంద్ర ప్రభుత్వ రవాణా శాఖ ఏర్పాటు చేయనున్న నూతన విధానం ప్రకారం, ఇక పై డ్రైవింగ్ లైసెన్స్ కోసం రీజనల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్(ఆర్ టీఓ) ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఇక నుండి కేంద్ర ప్రభుత్వం గుర్తించిన డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలలో డ్రైవింగ్ కోర్సు పూర్తి చేసిన తరువాత వారు ఆ కేంద్రం నుంచే శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు.
ఐఎఫ్‌ఎఎస్సీ కోడ్‌లు:
ప్రభుత్వ బ్యాంకులైన సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంక్‌లో విలీనం అయిన సంగతి తెలిసిందే. కాగా, జులై 1వ తేదీ నుంచి సిండికేట్ బ్యాంక్ ఖాతాదారులు కెనరా బ్యాంక్‌కు చెందిన కొత్త ఐఎఫ్‌ఎఎస్సీ కోడ్‌లు వినియోగించాల్సి ఉంటుంది. ఐఎఫ్‌ఎఎస్సీ కోడ్ లను కెనరా బ్యాంక్ వెబ్‌సైట్ ద్వారా పొందొచ్చు.
పాత చెక్కు బుక్కులు చెల్లవు:
మీరు ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ ఖాతాదారులా? ఈ రెండు బ్యాంకులు యూనియన్ బ్యాంకులో విలీనం అవడం వల్ల పాత చెక్కు బుక్కులు జులై 1 నుంచి ఇక చెల్లవు. కొత్త చెక్కు బుక్కులు యూనియన్ బ్యాంకు శాఖల్లో తీసుకోవాల్సి ఉంటుంది.
టీడీఎస్ కొత్త రూల్స్:
కేంద్రం అమల్లోకి తెచ్చిన ఫైనాన్స్ చట్టం 2021 ప్రకారం గత రెండేళ్లలో చెల్లించాల్సిన టీడీఎస్, టీసీఎస్ పన్ను రూ.50,000 కంటే ఎక్కువగా ఉంటే వారి నుంచి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే సమయంలో అధిక శాతంలో పన్ను వసూలు చేయాలని ఆదాయపు పన్ను విభాగం నిర్ణయించింది. ఇది జులై 1 నుంచి అమల్లోకి వస్తుంది.