టాలీవుడ్: ఈ సంవత్సరం ఆరంభంలో ‘క్రాక్’ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి మంచి ఫామ్ లో ఉన్న రవి తేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. ఇది షూటింగ్ దశలో ఉండగానే మరొక సినిమా మొదలుపెట్టాడు. ఇండస్ట్రీ కి ఎంతో మంది కొత్త టెక్నీషియన్స్ ని , డైరెక్టర్స్ ని పరిచయం చేసిన ఘనత రవి తేజ కి ఉంది. ఈ సినిమాతో మరో కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నాడు. శరత్ మండవ అనే నూతన దర్శకుడు ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు. అంతే కాకుండా ఈ సినిమాతో రవి తేజ కూడా నిర్మాతగా మారనున్నాడు. RT టీం వర్క్స్ అనే బానర్ స్థాపించి ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయ్యాడు.
ఈ సినిమా ప్రకటించడం తో పాటు ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదల చేసారు. ఈ పోస్టర్ లో ఒక పాత గవర్నమెంట్ ఆఫీస్ సెటప్ లో రవి తేజ కూర్చున్నట్టు అనిపిస్తుంది. బ్యాక్ డ్రాప్ లో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయం అని ఒక బోర్డు, ప్రమాణ స్వీకారం చేసిన ఒక లెటర్, టైపు రైటర్, పాత ఫైల్స్ కనిపిస్తున్నాయి. డైరెక్టర్ ఇచ్చిన హింట్స్ ప్రకారం ఈ సినిమాలో రవి తేజ ఎంప్లాయిస్ యూనియన్ లీడర్ గా కనిపించనున్నట్టు తెలుస్తుంది. చూస్తుంటే రవి తేజ రెగ్యులర్ సినిమాల్లా కాకుండా ఈసారి కొత్తగా ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ సినిమాలో మజిలీ సినిమాలో నటించిన దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ గా నటిస్తుంది. సామ్ సి.ఎస్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. విరాట పర్వం సినిమాని నిర్మిస్తున్న SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి తో కలిసి రవితేజ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ రోజు నుండి ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టారు.