హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్– 2021 కు రిజిష్టర్ చేసుకోవడానికి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును ప్రభుత్వం జూలై 8వ తేదీ వరకు పొడిగించింది. ఆ రోజు వరకు అప్ప్లై చేసుకోవడానికి ఎటువంటి అపరాధ రుసుము లేకుండా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ ఎ.గోవర్ధన్ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గురువారం ఓ ప్రకటనలో ఆయన సూచించారు.
అలాగే రాష్ట్రంలోని 6 ప్రభుత్వ సంగీత మరియు నృత్య కళాశాలల్లో 2021–22 విద్యా సంవత్సరానికి గాను అన్ని డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నాటక సంగీతం, కూచిపూడి మరియు కథక్ నృత్యాలు, భరతనాట్యం, సితార్, మృదంగం, వీణ, నాదస్వరం వంటి సాహిత్య కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
వీటికి దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 10 సంవత్సరాల వయసు ఉండి తీరాలని ఆయన తెలిపారు. వీటిపై పూర్తి వివరాలకు త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల కోసం 040–24758090 నంబరు కు, భక్త రామదాసు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల కోసం 040–27801788 నంబరు కు, అన్నమాచార్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల కోసం 040–23523850 నంబరు కు, విద్యా రణ్య ప్రభుత్వ సంగీత కళాశాల కోసం 87024 23628 నంబరుకు సంప్రదించాలని ఆయన తన ప్రకటనలో తెలిపారు.