డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రానికి 11వ ముఖ్యమంత్రిగా పుష్కర్‌సింగ్ ధామి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ బేబీ రాణి మౌర్య రాజ్‌భవన్‌లో ఆయన చేత ప్రమాణం జరిపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు సత్పాల్ మహరాజ్, హరాక్‌సింగ్ రావత్, ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ధామీతో పాటు మరి కొంతమంది కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు.
ప్రమాణం చేసిన వారిలో బిషన్‌సింగ్ చుపాల్, సుబోధ్ ఉనియాల్, అరవింద్ పాండే, గణేష్ జోషి, ధన్‌సింగ్ రావత్, రేఖా ఆర్య, యతీశ్వర్ ఆనంద్ ఉన్నారు. కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన పుష్కర్‌సింగ్ ధామీకి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ శుక్రవారం తన సీఎం పదవికి రాజీనామా చేసారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆరు నెలలలోగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉండగా తీరత్ సింగ్ రావత్‌కు సమయం కలిసిరాలేదు. ఒకవైపు కరోనా మహమ్మారి, మరోవైపు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు సమీపించడంతో ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఎలక్షన్ కమిషన్ ఉప ఎన్నిక నిర్వహించలేని పరిస్థితుల్లో ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. పార్టీ అంతర్గత కారణాలు కూడా బీజేపీ అధిష్టానం ఆయనను తప్పించడానికి దోహదం చేశాయని తెలుస్తోంది.