కోల్‌కతా: భారత జాతీయ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అలియాస్ దాదా గురువారం తన 49వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అలియాస్ దీదీ ఇవాళ దాదా ఇంటికి నేరుగా వెళ్లి మరీ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గంగూలీ నివాసంలో కొద్దిసేపు గడిపిన దీదీ, గంగూలీ కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడారు.
ప్రిన్స్ ఆఫ్ కోల్‌కతాగా పేరున్న సౌరవ్ గంగూలీని ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రే ఇంటికెళ్లి మరీ శుభాకాంక్షలు తెలపడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. సౌరవ్ గంగూలీ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేస్తాడని టీఎంసీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అయితే దాదా బీజేపీతో సైతం క్లోజ్‌గానే మూవ్ అవుతుంటాడు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు, బీసీసీఐ జనరల్ సెక్రెటరీ జై షాతో కలిసి దగ్గరగా పనిచేస్తుంటాడు.
కాగా, గంగూలీ ఇవాళ ఉదయం కోల్‌కతాలోని తన కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను నిరాఢంబరంగా జరుపుకున్నారు. తన సహోద్యోగులు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని చిరునవ్వులు చిందుస్తూ ఆయన కేక్ కట్ చేశారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ క్రికెట్, యూరోకప్, కోపా అమెరికా ఫుట్‌బాల్, ఒలింపిక్స్‌కు సంబంధించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
ఇంకోవైపు దాదాకు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. దేశంలోని సినీ, రాజకీయ మరియు క్రీడా ప్రముఖులు ఆయనకు విషెస్ తెలియజేశారు. భారత్ తరఫున 113 టెస్ట్‌లు, 311 వన్డేలు ఆడిన దాదా రెండు ఫార్మాట్లలో కలిపి 18,575 రన్స్ చేశాడు. మొత్తం 195 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన ఆయన 97 మ్యాచ్‌ల్లో టీమిండియాకు విజయాలనందించి భారత దేశపు అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు.