న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి నిప్పులు చెరిగారు. ప్రధానంగా దేశంలో నెలకొన్న కరోనా వ్యాక్సిన్ల కొరత మరియు ఇటీవలి కేబినెట్ విస్తరణ విషయాన్ని టార్గెట్‌గా చేసుకుని విమర్శలు గుప్పించారు. దేశంలో కొత్తగా మంత్రుల సంఖ్య పెరిగింది కానీ కోవిడ్ వ్యాక్సిన్ల సంఖ్య మాత్రం కాదు అన్ని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా టీకాల గణాంకాల వివరాలను ట్విటర్‌లో రాహుల్ గాంధీ షేర్ చేశారు.
దేశంలో రోజుకు సగటుగా వేస్తున్న టీకాల సంఖ్యను వివరిస్తూ, ఇలా అయితే దేశంలో డిసెంబర్ 2021 నాటికి అందరికీ వ్యాక్సినేషన్ అందించే ప్రక్రియ పూర్తవ్వదనే సందేహాలను ఆయన లేవనెత్తారు. ‘వేర్ ఆర్ వ్యాక్సిన్’ అనే ఒక హ్యష్‌ట్యాగ్ తో రాహుల్ ట్విటర్ ద్వారా తన దాడిని పెంచారు. రాహుల్ దేశంలోని వ్యాక్సిన్ల కొరత సమస్యపై ఇప్పటికే చాలాసార్లు ఆందోళన వ్యక్తం చేసిన కాంగ్రెస్, మహమ్మారి థర్డ్ వేవ్ ఆందోళన నేపథ్యంలో దేశ జనాభాకు త్వరితగతిన టీకాలందించే కార్య్రకమాన్ని మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా ఈ ట్విట్ చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా రెండవ సారి అధికారాన్ని చేపట్టిన తరువాత మోదీ తన కేబినెట్ మంత్రుల సంఖ్యను భారీగా విస్తరించిన సంగతి తెలిసిందే. ఈ విస్తరన ద్వారా ప్రభుత్వంలో 43 మంది కొత్త మంత్రులను చేర్చుకోగా ఇప్పుడు దేశంలోని మొత్తం మంత్రుల సంఖ్య 77 కి చేరింది.