హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం మొత్త మీద భూములు మరియు ఆస్తుల రిజిస్ట్రేషన్ రుసుములను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే ఇప్పటికే భూములు మరియు ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలను పెంచాలని నిర్ణయించింది. ఇప్పుడు ఇదే క్రమంలో రిజిస్ట్రేషన్ల ఫీజుల్లో కూడా మార్పులను తీసుకురావాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న రిజిస్ట్రేషన్ ఫీజు కింద భూమి లేదా ఆస్తి విలువలో 6 శాతం రుసుమును వసూలు చేస్తుండగా, తాజాగా ఆ రుసుమును 7.5 శాతం నుంచి 8 శాతం వరకు సవరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పక్క రాష్ట్రాల్లో ఇప్పటికే 7-8 శాతం రిజిస్ట్రేషన్ ఫీజును వసూలు చేస్తుండటం, రాష్ట్రంలో దాదాపు ఎనిమిదేళ్లుగా ఒక్కసారి కూడా ఈ ఫీజులు పెంచకపోవడం నేపథ్యంలో, ఈసారి ఫీజుల పెంపుదల ప్రతిపాదనను సీరియస్‌గానే పరిశీలిస్తున్నట్టు సమాచారం.
అయితే మరోపక్క ఇప్పటికే భూముల విలువలను పెంచనున్న నేపథ్యంలో ఒకేసారి రిజిస్ట్రేషన్ ఫీజును కూడా పెంచితే, రాష్ట్ర ప్రజలపై అధిక భారం మోపినట్లు అవుతుందనే తర్జనభర్జన కూడా జరుగుతున్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి మంగళవారం జరుగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెప్తున్నాయి.
ఈ పెంపు ఆమోదం పొంది అమలులోకి వస్తే రాష్ట్రానికి ప్రతి నెలా అదనంగా దాదాపు రూ.250 కోట్లు వరకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం రిజిస్ట్రేషన్ల నూండి వచ్చే ఆదాయం సుమారు నెలకు రూ.500 కోట్లకు అటూఇటుగా ఉంది. తాజాగా విలువలు, చార్జీల పెంపు అమల్లోకి వస్తే, ఆదాయం 50 శాతం మేర పెరుగుతుందని అధికారుల లెక్కలు తెలియజేస్తున్నాయి.
ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ లోని ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో రిజిస్ట్రేషన్ చార్జీలు, భూముల విలువ పెంపుతోపాటు 50 వేల ఉద్యోగాల భర్తీ, రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, వర్షాకాలం సీజన్ మొదలైన నేపథ్యంలో వ్యవసాయ పరిస్థితులు, పాఠశాలలు, పుస్తకాల పంపిణీ, ఇతర విద్యారంగ సమస్యలపై చర్చించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.