హైదరాబాద్: తెలంగాణ మునిసిపాలిటీల అభివృద్ధికై ల్యాండ్ పూలింగ్ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సిఎం కేసీఆర్ యోచనలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోని వీధి దీపాల కోసం మూడవ వైర్ ను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అలాగే ఒక నెల రోజులలోగా వైకుంఠధామాల నిర్మాణాలు కూడా పూర్తి చేయాలని తెలిపారు.
మంగళవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో భాగంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పురోగతిపై చర్చించిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ మహా నగర శివార్లలోని మున్సిపాలిటీల్లో మంచినీటి సమస్య నివారణ కోసం అదనంగా రూ.1200 కోట్ల రూపాయల నిధిని మంజూరు చేశారు.
రాష్ట్రంలో మంచి నీటి ఎద్దడి నివారణకు కావాల్సిన చర్యలు తక్షణమే చేపట్టాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ల్యాండ్ పూలింగ్ వ్యవస్థ ద్వారా ప్రత్యేకంగా లేఅవుట్లను అభివృద్ధి చేయాలని అధికారులు ఆదేశించారు. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల అధికారులు కేబినెట్‌కు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పురోగతికి సంబంధించిన పలు నివేదికలను కేబినెట్ లో సమర్పించారు.