చండీగఢ్: హర్యానా రాష్ట్రంలో దేశంలోనే రేషన్ ఏటీఎంను తొలిసారిగా ప్రయోగించింది హర్యానా ప్రభుత్వం. కాగా ఈ పైలట్ ప్రాజక్ట్‌ను హర్యానాలోని గరుగ్రామ్ ఫరూక్‌నగర్‌లో ఆ రాష్ట్ర డెప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమం తరువాత మీడియాతో మాట్లాదిన ఆయన ఈ రేషన్ ఏటీఎం కేవలం ఐదు నుంచి ఏడు నిమిషాల లోనే 70 కిలోల వరకు బియ్యం, గోధుమలు మరియు ఇతర చిరుధాన్యాలను విడుదల చేయగలదని అన్నారు.
ఈ రేషన్ ఏటీఎం మెషిన్ టచ్‌స్క్రీన్ ద్వారా పని చేస్తుందని ఆయన తెలిపారు. ఇది బయోమెట్రిక్ వ్యవస్థ ఆధారంగా పని చేస్తుందని, ధ్రువీకరణ విజయవంతమైతే ఆ లబ్ధిదారుని రేషన్ కోటా ప్రకారం ధాన్యాన్ని లెక్కించి ఆటోమెటిక్‌గా సంచుల్లో నింపుతుందని ఆయన అన్నారు. దీని వలన ప్రజలకు పారదర్శకంగా రేషన్ సరుకులు అందుతాయన్నారు.
ఈ మెషిన్ ఆటోమేటెడ్ మల్టీ కమోడిటీ ధాన్యం పంపిణీ యంత్రంగా ఉపయోగపడుతుందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. కాగా ఇదే దేశంలోని తొలి రేషన్ ఏటీఎం, ఇది పైలట్ ప్రాజెక్ట్‌గా ఫరూకనగర్‌లో విజయవంతంగా నిర్వహించిన అనంతరం యూఎన్ ప్రపంచ ఆహార కార్యక్రమం క్రింద వీటిని త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.
రేషన్ సరుకులూ పంపిణీలో అవినీతికి చోటు లేకుండా చేయడమే కాకుండా సరుకుల కొరతను కూడా ఇది తగ్గిస్తుందని అన్నారు. ఈ ఏటీఎంలో రేషన్ సరుకులు, గోధుమలు, ధాన్యం, చిరుధాన్యాలు సరఫరా చేసేలా దీన్ని తయారు చేశారన్నారు. కాగా ఫరూక్‌నగర్‌లో ప్రారంభించిన ఈ మెషిన్ లో కేవలం గోధుమలు మాత్రమే అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.