న్యూఢిల్లీ: కరోనా వైరస్ తొలి దశ రెండవ దశ విజృంభనతో పెట్టిన ఆంక్షలతో దేశం మొత్తం మీద పాఠశాల విద్య బాగా దెబ్బతినింది. కాగా స్కూళ్ల తిరిగి తెరచే విషయమై ఐసీఎంఆర్ సెక్రటరీ డాక్టర్ బలరామ్ భార్గవ ఈ రోజు కొన్ని కీలక సూచనలు చేశారు.
ఆయన ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో తొలుత ప్రాథమిక పాఠశాలలు తెరవడం మంచిదని అభిప్రాయపడ్డారు. దీనికి కారణం పిల్లలు ఈ వైరస్ ఇన్‌ఫెక్షన్‌ను తట్టుకునే సామర్థ్యం ఎక్కువగా ఉండటమే కారణం అన్నారు. అలాగే పాఠశాలలు తెరిచే ముందు టీచర్ల అందరికి వ్యాక్సినేషన్ పూర్తి చేయడం మంచిదని తరువాత స్కూళ్లు తెరవొచ్చని ఆయన తెలిపారు.
సెకండరీ పాఠశాలల కంటే ముందు ప్రాధమిక పాఠశాలలు ప్రారంభిస్తే మంచిది అనే సంకేతాలను ప్రభుత్వం కూడా మంగళవారం అందించింది. అయితే అంతకంటే ముందు పాఠశాలల బస్సు డ్రైవర్లు, ఉపాధ్యాయులు మరియు పాఠశాలల్లో పని చేసే ఇతర సిబ్బందికి టీకాలు వేయడం మాత్రం చాలా అవసరమని ఐసీఎంఆర్ డీజీ భార్గవ పేర్కొన్నారు.
అలాగే దేశంలో 2-18 ఏళ్ల లోపు పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ వేసే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. ఇక భారత్ బయోటెక్ కోవాక్సిన్ టీకా రెండు,మూడు దశల ట్రయల్స్ డేటా త‍్వరలోనే వెల్లడికానుందని, దీంతో సెప్టెంబర్ నాటికి టీకా లభించనుందనే అంచనాలను ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా ఇటీవల చెప్పారు.