న్యూఢిల్లీ: రాబోయే రోజుల్లో హెచ్సీఎల్ టెక్ ఫ్రెషర్లను భారీగా ఉద్యోగాలను భర్తీ చేయబోతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఉన్న డిమాండ్ తగ్గట్టుగా దాదాపు 30 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు హెచ్సీఎల్ హెచ్ఆర్ ఆఫీసర్ వీవీ అప్పారావ్ తెలిపారు. కాగా ప్రతి ఏడూ కంపెనీలో సుమారుగా 40 నుంచి 50 శాతం మేర ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
క్రితం ఏడాది హెచ్సీఎల్ సుమారు దాదాపు 14 వేల మంది ఫ్రెషర్లను నియమించుకుంది. 2021 సంవత్సరానికి గాను దాదాపు 20 వేల నుంచి 22 వేల మంది ప్రెషర్లను నియమించుకోవాలని హెచ్సీఎల్ భావిస్తోందని వీవీ అప్పారావు పేర్కొన్నారు. అలాగే ఇక పై ప్రతి సంవత్సరం 40-50 శాతం నూతనంగా నియామించుకోవాలని, సుమారు 30 వేల మంది కొత్త వారికి ఉద్యోగాలను హెచ్సీఎల్ కల్పించనుందని వీవీ అప్పారావు తెలిపారు.
ప్రస్తుతం హెచ్సీఎల్ కంపెనీలో 1.76లక్షల మంది వరకు ఉద్యోగులు పని చేస్తున్నారు. కాగా హెచ్సీఎల్ 35 శాతం కొత్త వారిని, 65 శాతం అనుభవం కల్గిన ఉద్యోగులను నియమిస్తోంది. రాబోయే రెండు సంవత్సరాల్లో ఫ్రెషర్ల సంఖ్యను 70 శాతానికి పెంచాలని కంపెనీ భావిస్తోందని తెలిపారు.
ఐఐటీ వంటి ప్రసిద్ధ కళాశాలల నుండి హెచ్సీఎల్ చాలా మంది ఫ్రెషర్లను నియామాకం చేసుకోనుంది. ఈ సంవత్సరం ఇప్పటికే ఐఐటీల నుంచి సుమారు 206 మందిని నియమించింది. గత ఏడాది ఐఐటీల నుంచి ఫ్రెషర్ల భర్తీ సంఖ్య 134 గా ఉంది. కాగా దేశవ్యాప్తంగా పలు టాప్ 200 కాలేజీల నుంచి ఫ్రెషర్లను నియమించుకోవడానికి హెచ్సీఎల్ సన్నాహాలు చేస్తోందని హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ వీవీ అప్పారావు పేర్కొన్నారు.